తిరుగు పయనం.. భక్తజన నీరాజనం
పెనుగంచిప్రోలుకు బయలుదేరిన తిరుపతమ్మ
జగ్గయ్యపేట: పట్టణంలోని రంగుల మండపం నుంచి పెనుగంచిప్రోలుకు పయనమైన గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు, సహదేవతల విగ్రహాలు ప్రత్యేక మండపంలో తిరుగు పయనమయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమ్మవారి శోభాయాత్ర కనుల పండువగా సాగింది. మహిళలు పల్లకీలకు ప్రత్యేక స్వాగతాలు పలికారు. పల్లకీలను చూసేందుకు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. విజయవాడ–చిల్లకల్లు రహదారి భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవ కమిటీ మహిళలు నృత్యాలతో అమ్మవారికి స్వాగతం పలికారు. రంగుల మండపంలో 11 విగ్రహాలకు ప్రధానార్చకులు పూజలు చేసి కళ్లకు గంతలు కట్టి పల్లకీల్లోకి ఎక్కించారు. విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు, ఆలయ ఏసీ మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పల్లకీలను పర్యవేక్షించారు. సాయంత్రం ఆరు గంటలకు జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లుకు చేరుకుంది. యాదవబజార్, బొడ్డురాయి సెంటర్‌లో పల్లకీలకు విశ్రాంతినివ్వటంతో గ్రామస్తులు పూజ లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వత్సవాయి మండలం భీమవరం, పెనుగంచిప్రోలు మండలంలోని భీమవరం మీదుగా శుక్రవారం తెల్లవారుజాముకు పెనుగంచిప్రోలు ఆలయానికి విగ్రహాలు వెళ్లనున్నాయి.
తిరుగు పయనం.. భక్తజన నీరాజనం


