కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది | - | Sakshi
Sakshi News home page

కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది

Jan 17 2026 11:47 AM | Updated on Jan 17 2026 11:47 AM

కాల్‌

కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది

కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది

కుమారుడి ఫిర్యాదుతో..

భార్యను హత్య చేసి అనారోగ్యంతో

చనిపోయిందని నమ్మించిన భర్త

ఏడు నెలలు తరువాత కాల్‌ రికార్డుతో

వెలుగు చూసిన నిజం

భర్తతో పాటు వివాహేతర సంబంధం

నడుపుతున్న మహిళ అరెస్ట్‌

పెనమలూరు: భార్యను హత్య చేసి సహజ మరణంగా నమ్మించిన భర్త అసలు స్వరూపం ఏడు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో కలిసి భార్య హత్యకు పన్నిన పథకం కాల్‌ రికార్డర్‌లో నమోదైంది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. కృష్ణాజిల్లా పోరంకిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకి పాత పోస్టాఫీసు ప్రాంతంలో ముక్కామాల ప్రసాద్‌చౌదరి(పండు)(53), భార్య రేణుకాదేవి(48) ఉంటున్నారు. వీరికి 1998వ సంవత్సరంలో వివాహమైంది. రేణుకాదేవిది గుంటూరు జిల్లా నీరుకొండ గ్రామం. వీరికి ముక్కామాల తేజశ్రీ, ముక్కామాల నగేష్‌ పిల్లలు ఉన్నారు. కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తుండగా, కుమారుడు యూకేలో చదువుతున్నాడు. అయితే ప్రసాద్‌చౌదరికి దురలవాట్లు కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా ప్రసాద్‌చౌదరికి పోరంకి బ్రహ్మంగారి గుడి వద్ద ఉంటున్న ఆకునూరు ఝాన్సీ(35)తో పరిచయం ఏర్పడింది. ఝాన్సీ భర్త ఐదేళ్ల క్రితం కనబడకుండా పోయాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అప్పటి నుంచి ఝాన్సీ బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. రేణుకాదేవి ఇంటికి వచ్చి ఝాన్సీ మేకప్‌ వేసేది. దీంతో ఝాన్సీకి ఇంట్లో చనువు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌చౌదరికి ఝాన్సీకి వివాహేత సంబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి తిరుగుతుండటంతో భార్య రేణుకాదేవి అభ్యంతరం తెలిపింది. దీంతో దంపతుల మధ్య గొడవలు తారస్థాయి చేరాయి. భార్య రేణుకాదేవి బరువు తగ్గటానికి లైపో చేసుకోవటంతో ఆరోగ్యం బాగా లేదన్న సాకుతో ప్రసాద్‌చౌదరి ఝాన్సీతో పూర్తి స్థాయిలో సంబంధం కొనసాగించాడు.

భార్య అడ్డుగా ఉందని..

వారి మధ్య గొడవలు పెరుగుతుండటంతో రేణుకాదేవిని హత్య చేయాలని ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ పథకం పన్నారు. ఎవరికి అనుమానం రాకుండా చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. రేణుకాదేవిని చంపే సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటే అనుమానం రాదని పథకం వేశారు. హత్యకు ముందు ఝాన్సీ ఖమ్మంకు వెళ్లింది. ఫోన్‌లో ఝాన్సీ ఇచ్చిన సూచనలతో ప్రసాద్‌చౌదరి గతేడాది మే 18న గ్రామంలో జరిగిన గుడి వార్షికోత్సవాల్లో రేణుకాదేవి పాల్గొన్నారు. తరువాత భర్తతో ఇంటికి వెళ్లి రేణుకాదేవి నిద్రపోగా, పక్క గదిలో అత్తమామలు నిద్రపోయారు. ప్రసాద్‌చౌదరి అర్ధరాత్రి ఇంట్లో మద్యం తాగి మే 19వ తేదీ వేకువజామున నిద్రపోతున్న రేణుకాదేవిని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాత కొద్ది సమయం వేచి చూసి ఏమీ తెలియనట్లు పక్క గదిలో నిద్రపోతున్న అత్త మామలు నన్నపనేని సామ్రాజ్యం, ప్రసాదరావును లేపి రేణుకాదేవి కదలటం లేదని చెప్పాడు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యంతో రేణుకాదేవి మృతి చెందినట్లు నమ్మించాడు. కుమారుడు యూకే నుంచి వచ్చిన తరువాత మే 21న అంత్యక్రియలు చేసి దినం కార్యక్రమాలు పూర్తి చేశాడు. ఈ వ్యవహారమంతా ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ వేసిన పథకం ప్రకారం చేశారు.

రేణుకాదేవిని హత్య చేసిన తరువాత తమకు అడ్డు తొలగిందని ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలు భావించారు. అయితే సెల్‌ఫోన్‌ వారి చేసిన హత్యను బయటపెట్టింది. ప్రసాద్‌చౌదరి కుమారుడు నగేష్‌ యూకేకు వెళ్లిన సమయంలో అతని సెల్‌ఫోన్‌ తండ్రికి ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రసాద్‌చౌదరి ఆ ఫోన్‌ వాడుతున్నాడు. ఝాన్సీతో కలిసి ప్రసాద్‌చౌదరి హత్యకు రచించిన పథకం సంభాషణ మొత్తం ఫోన్‌లో రికార్డు అయింది. కొన్ని నెలలు గడిచాయి. తల్లి చనిపోయిన నాటి నుంచి ఊర్లోనే ఉంటున్న కుమారుడు నగేష్‌ ఇటీవల తండ్రి వాడుతున్న తన ఫోన్‌ను పరిశీలించాడు. ఫోన్‌లో రికార్డు అయిన సంభాషణలు విని తండ్రే పథకం పన్ని తల్లిని హత్య చేశాడన్న విషయం తెసుకున్నాడు. ఇది తెలుసుకున్న ప్రసాద్‌చౌదరి, ఝాన్సీ వారి సాక్షాలు లేకుండా ఉండటానికి తమ వద్ద ఉన్న ఫోన్లు ధ్వంసం చేశారు. అయితే అప్పటికే ఫోన్‌ సంభాషణను భద్రపర్చిన నగేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఎస్‌ సీఐ గోవిందరాజు, బృందం ప్రత్యేకంగా దర్యాపు చేశారు. నిందితులు పక్కా ఆధారాలతో దొరకటంతో ఈ నెల 13న ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలను అరెస్టు చేశారు. కోర్టు ఇద్దరికి రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ప్రసాద్‌చౌదరి తల్లి శివపార్వతి, యూఎస్‌లో ఉంటున్న సోదరుడు చందర్‌రావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది 1
1/1

కాల్‌ రికార్డే హంతకులను పట్టించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement