చెప్పుల దుకాణంలోకి దూసుకువెళ్లిన కారు
కోడూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి అతి వేగంగా కారు నడుపుతూ చెప్పుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన కోడూరులో చోటుచేసుకుంది. స్థానిక గొల్లపాలెం రోడ్డులోని పంచాయతీ వెనుక భాగంలో కోడూరుకు చెందిన బాబూరావు చెప్పులు కుట్టే దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కోడూరుకు చెందిన కందుల వెంకట చందు మద్యం మత్తులో కారు నడుపుతూ అతి వేగంగా చెప్పుల షాపును ఢీ కొట్టి దుకాణంలోకి దూసుకువెళ్లాడు. ఘటన జరిగిన వెంటనే వెంకట చందు అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో దుకాణం వద్ద ఉన్న అద్దంకి ఏడుకొండలుకు బలమైన గాయాలయ్యాయి. మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. బాధితులను 108 వాహనంలో హుటాహుటినా అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుకొండలు పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నంకు తరలించారు. ఘటనా స్థలాన్ని కోడూరు పోలీసులు పరిశీలించి, వివరాలు సేకరించారు. కారు నడుపుతున్న వెంకట చందుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాణిక్య తెలిపారు.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నాలుగు రోజుల క్రితం భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి కార్‌తో హల్‌చల్ చేసిన ఘటనను మరువక ముందే సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మరో వ్యక్తి తల పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేదారేశ్వరపేట ఎనిమిదో లైన్‌కు చెందిన ధర్మవరపు మోహన్‌కుమార్(24) అనే వ్యక్తి ఈ నెల 15న వారి ఇంటి సమీపంలో ఉన్న బార్‌లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తనకు గతంలో పరిచయం ఉన్న రాము అనే వ్యక్తి సాల్మన్ అనే మరో వ్యక్తితో కలిసి మోహన్‌కుమార్ దగ్గరకు వచ్చి ఏంట్రా నాతో సరిగా మాట్లాడడం లేదు.. పట్టించుకోవడం లేదని అతనితో గొడవపడ్డారు. మోహన్‌కుమార్ వారితో మాట్లాడకుండా బార్ కౌంటర్‌లోకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుండగా ఇంతలో రాము వచ్చి మోహన్‌తో గొడవ పడుతూ ఉండగా సాల్మన్ తన చేతిలో ఉన్న బీరు సీసాతో మోహన్ తల పగలకొట్టాడు. దీంతో మోహన్ తలకు, చెవి వద్ద తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న మరికొంతమంది ప్రయత్నించగా వారిపై కూడా రాము, సాల్మన్ దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చెప్పుల దుకాణంలోకి దూసుకువెళ్లిన కారు
చెప్పుల దుకాణంలోకి దూసుకువెళ్లిన కారు


