దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివార్లను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం, సంక్రాంతి పండుగకు పల్లెలకు విచ్చేసిన భక్తులు, యాత్రికులు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రికి విచ్చేసి దుర్గమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉదయం 9 గంటల తర్వాత రద్దీ అధికం కావడంతో సిఫార్సు లేఖలు, వీఐపీల బంధువుల పేరిట వచ్చే భక్తులు, యాత్రికుల కట్టడికి దేవస్థాన ఈఓ శీనానాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గాలిగోపురం వద్ద ఉన్న స్కానింగ్ పాయింట్ వద్ద కూర్చుని టికెట్లు ఉన్న వారికి మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించారు.
రాత్రి వరకు కొనసాగిన రద్దీ..
టికెట్లు లేని వారిని, ిసిఫార్సులపై వచ్చే వారిని కేవలం రూ.300 క్యూలైన్‌లోకి అనుమతించారు. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం కల్పించారు. రద్దీ సమయంలో అంతరాలయ దర్శనం నిలిపివేస్తామని ముందుగానే ప్రకటించినా, శుక్రవారం రూ.500 టికెట్లు విక్రయించారు. టికెట్లు కొనుగోలు చేసిన వారందరికీ అంతరాలయ దర్శనం కల్పించారు. ఇక అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు గాను అర్ధ గంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనానికి గంటన్నర సమయం పట్టిగా, రూ.100, రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు గంటలోపే అమ్మవారి దర్శనం కలిగింది. మరో వైపున అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, ఎద్దుల బండి, పశువుల పాక వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు. సాయంత్రం 6 గంటలకు పంచహారతుల సేవ, పల్లకీ సేవతో పాటు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాత్రి 9 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.


