కోడి పందేల బరి వద్ద బ్లేడ్‌తో దాడి
భూషణగుళ్ల(పెదపారుపూడి): కోడి పందేల బరి వద్ద బ్లేడ్‌తో వ్యక్తిని గాయపరిచిన సంఘటన మండలంలోని భూషణగుళ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. గుడివాడ ఏరియా ఆస్పత్రి ఆవుట్ పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని భూషణగుళ్ల గ్రామంలో జరుగుతున్న కోడి పందేల బరి వద్ద గుడివాడ పట్టణంలోని ధనియాలపేటకు చెందిన అనగాని జగన్నాథం(45) అదే గ్రామానికి చెందిన విక్కుర్తి ఈశ్వరరావు తండ్రికి పందెం విషయంలో గొడవ జరిగింది. ఇంటి వద్ద ఉన్న ఈశ్వరరావుకు విషయం తెలపటంతో తనతో పాటు బ్లేడ్ తీసుకుని వచ్చాడు. కోడి పందెం గెలిచిన జగన్నాథం కోడి పుంజును తీసుకుంటుండగా ఈశ్వరరావు బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈదాడిలో జగన్నాథం మెడపై తీవ్రంగా గాయమైంది. దీంతో బాధితుడిని ప్రైవేట్ వాహనంలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు జగన్నాథం కుటుంబ సభ్యులు చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, కేసు వివరాలను పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు పంపామని గుడివాడ పోలీసులు తెలిపారు.


