గంగినేనిలో తెలుగు తమ్ముళ్ల వీర విహారం
● గంగినేని కోడి పందేల బరి వద్ద కొట్లాట
● తెలంగాణకు చెందిన యువకుడిపై
తీవ్ర స్థాయిలో దాడి
● అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై
దాడి చేసిన తమ్ముళ్లు
జి.కొండూరు: సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన కోడి పందేల బరి వద్ద తెలుగు తమ్ముళ్లు వీర విహారం చేశారు. గంగినేని గ్రామంలో కోడి పందేల బరి వద్ద ముగింపు సంబరాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తెలుగు తమ్ముళ్లు డీజేలతో డ్యాన్సులు వేస్తుండగా తెలంగాణ రాష్ట్రం, రేమిడిచర్లకు చెందిన గోసి పరమేశ్వరరావు అనే వ్యక్తి న్యూడిల్స్ తింటూ తెలుగు తమ్ముళ్ల సంబరాలపై కామెంట్ చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా రెచ్చిపోయి అతనిపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. దీనితో పరమేశ్వరరావు తల పగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లగా అతని పక్కన వచ్చిన వ్యక్తులు అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి తెగబడ్డారు. దీనితో వారు పరారయ్యారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వీరకుమార్ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి తెగబడడం విస్మయానికి గురి చేసింది. కానిస్టేబుల్‌ని సైతం కొట్టడంతో కొట్లాటను ఆపేందుకు గ్రామస్తులు ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఆ తర్వాత కోడి పందేల నిర్వాహకులు అడ్డుకోవడంతో గొడవ సర్ధుమణిగింది. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడు పరమేశ్వరరావును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి తెగబడిన నలుగురు వ్యక్తులను జి.కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకోగా అసలు దాడి చేసిన తెలుగు తమ్ముళ్లను వదిలేసి అమాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.


