
దుర్గమ్మకు కానుకగా బంగారపు సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు గురువారం రూ.1.68 లక్షల విలువైన బంగారపు సూత్రాలు, నానుతాడును కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన దాసరి భారత నరేంద్ర సింహ తన తల్లి రాజేశ్వరి పేరిట అమ్మవారికి 16 గ్రాముల బంగారం, ఎరుపు రంగు రాళ్లుతో తయారు చేయించిన మంగళసూత్రాలు, నానుతాడును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
కనులపండువగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు
విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణమండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అష్టబంధన, మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం ముగిశాయి. వైఖానస ఆగమ సంప్రదాయంలో మహా పూర్ణాహుతి, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశం, కుంభాబింబ సమారోహణం కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని కంకణభట్టార్ మురళీకృష్ణ అయ్యంగార్, టీటీడీ ఆస్థాన ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములు వేదాంతం వెంకట శశికిరణ్ నిర్వహించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి, భావన్నారాయణా చార్యులు, సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, ఇంజినీరింగ్ అధికారులు నాగభూషణం, సురేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఐదువేలమంది పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ ఎంట్రీలకు రేపటి వరకు గడువు పొడిగింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేసేందుకు నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీల ఎంట్రీల గడువును ఫొటోగ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు ఎంట్రీల గడువును జూలై 31వ తేదీగా నిర్ధారించామని, ఫొటోగ్రాఫర్లు మరో రెండు రోజులు గడువుకావాలని విజ్ఞప్తి చేసిన దరిమిలా ఆగస్టు 2వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.