
రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి వారి నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి ముంబై వెళుతున్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బీ4 కోచ్‌లోని 41, 44 బెర్త్‌లలో ప్రయాణం చేస్తున్న ముంబైకి చెందిన అంధురాలు జయ ఆలీముల్లా సర్దార్, లక్ష్మీ శంకర్ నాటేకర్ అనే ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను సోదా చేయగా అందులో 15 బండిల్స్‌లో ప్యాక్ చేసిన మొత్తం 30 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో ఆర్‌పీఎఫ్ సీఐ ఫతే ఆలీబేగ్, ఎస్‌ఐ మకత్‌లాల్, జీఆర్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.
30 కిలోల గంజాయి స్వాధీనం