
వీసీ లేక.. సమస్యలు వీడక
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే మొట్ట మొదటి హెల్త్ వర్సిటీగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వ విద్యాలయం పేరును మార్చడంపై చూపిన శ్రద్ధ, వైస్ చాన్స్‌లర్ నియామకంపై లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా వర్సిటీ పరిధిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాదు ఏదైనా సమస్య తెలిపేందుకు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీసీ అందుబాటులో లేక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
బలవంతంగా రిజైన్ చేయించి..
హెల్త్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ కె. బాబ్జి పదవీ కాలం 2026 ఫిబ్రవరి వరకూ ఉంది. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయనను నియమించిందనే కక్షతో బలవంతంగా పదవిలో నుంచి తప్పుకునేలా చేశారు. పాలకుల ఒత్తిడితో గత ఏడాది జూలై 1 డాక్టర్స్ డే రోజున ఆయన పదవికి రిజైన్ చేశారు. నాటి నుంచి కొత్త వీసీని నియమించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తమకు నచ్చిన వారు దొరక్క పోవడమా.. కూటమి పార్టీల మధ్య సమన్వయం లేక పోవడమో.. కారణమేమో గానీ నియామకం మాత్రం జరపడం లేదు. నోటిఫికేషన్ జారీ చేసి నాలుగు నెలలు గడిచింది.. ఎంపిక ఎప్పుడు చేస్తారో తెలియని దయనీయ స్థితి నెలకొంది.
పడకేసిన పాలన..
హెల్త్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ అరగంట మాత్రమే వీసీ చాంబర్‌లో ఉంటున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అది కూడా సిబ్బంది ఎవరూ విధులకు రాని సమయంలో ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకూ ఉంటున్నట్లు సమాచారం. ఏదైనా అత్యవసర పని ఉంటే ఆ విభాగాలకు చెందిన వారు ఉరుకులు, పరుగులపై రావాల్సి వస్తోందంటున్నారు. లేదంటే ఫైళ్లు తీసుకుని డీఎంఈ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. దీంతో ప్రతి పనిలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు యూనివర్సిటీ ఉద్యోగులు వివరిస్తున్నారు.
మసకబారిన ప్రతిష్ట..
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట కూటమి ప్రభుత్వంలో మసకబారుతోంది. వర్సిటీకి పెద్ద దిక్కు లేక పోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ ఇటీవల అస్తవ్యస్తంగా మారింది. వైద్య కళాశాలల్లో విద్యార్థులతో ఇష్టారాజ్యంగా కాపీలు రాయించారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల వద్ద స్లిప్‌లు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీకి పెద్దదిక్కు లేక పోవడంతో చుక్కానీ లేని నావలాగా పరిస్థితి తయారైనట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వైద్య రంగంతో పాటు, వైద్య విద్యను, యూనివర్సిటీ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం మంటగలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిణామాలపై వైద్యవర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గాడి తప్పిన పాలన వీసీ నియామకంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం పది నెలలుగా వీసీ లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో జాప్యం పరీక్షల నిర్వహణపైనా ఇటీవల ఆరోపణలు పాలనా పరంగా అనేక ఇబ్బందులు మసకబారుతున్న యూనివర్సిటీ ప్రతిష్ట