
మత్స్యకారుల్లో చైతన్యం తీసుకురావాలి
పటమట(విజయవాడతూర్పు): మత్స్యకారులు చైతన్యవంతులై ఐక్యంగా ఉద్యమించినప్పుడే మరిన్ని సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుంటారని, సంఘాన్ని చైతన్యం చేయాలని మత్స్యకార సంఘం నాయకులు అర్జిలిదాస్, సైకం భాస్కరరావు, లకనం నాగాంజ నేయులు, కొల్లు శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సముదాయ సంఘాల నెట్ వర్క్(ఫిష్ కాన్) ఆద్వర్యంలో పటమట అయ్యప్ప నగర్‌లోని సంఘం కార్యాలయంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పట్టి తెచ్చే మత్స్య సంపద ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించిపెడుతున్న వీరి సంక్షేమాన్ని పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. మత్స్యకారులకు అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేయలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు గ్రామాల్లో పక్కా ఇళ్లు, నాణ్యమైన విద్య, వైద్యం అవసరమైన అన్ని సౌకర్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంది ఇవ్వాలన్నారు. ఫిష్ కాన్ గ్రామ స్థాయి సంఘాల నుంచి ఇంటర్ నేషనల్ సంఘాలతో అనుసంధానమై ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని మత్స్య కారులకు అందిస్తోందని చెప్పారు. సమావేశంలో నాయకులు పీత ఈశ్వర ప్రసాద్, నాగిడి తాతారావు తదితరులు పాల్గొని మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఫిష్ కాన్ లోగోను నాయకులు ఆవిష్కరించారు.
కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ దుర్మరణం
కంకిపాడు: కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటనపై కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. పెనమలూరు మండలం తాడిగడప ప్రాంతానికి చెందిన బోయి అచ్చయ్య(46) టిప్పర్ డ్రైవర్. సొంతంగా కిరాయిలు తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం జి.కొండూరు నుంచి తన టిప్పర్‌లో కంకరు లోడు చేసుకుని పమిడిముక్కల మండటం మంటాడ గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో దావులూరు టోల్‌గేట్ దాటిన తరువాత టిప్పరు ఆపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో డివైడర్‌పై నించున్నాడు. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని దానిపై నిలబడ్డ అచ్చయ్యను ఢీ కొంది. దీంతో అచ్చయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

మత్స్యకారుల్లో చైతన్యం తీసుకురావాలి