
ఆర్చరీ కోచ్ చెరుకూరికి న్యాయం చేయాలి
విజయవాడస్పోర్ట్స్: ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అకాడమీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ చెరుకూరి సత్యనారాయణ మహానాడులోని ఆర్చరీ అకాడమీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం మూడో రోజు కొనసాగింది. దీక్ష చేపడుతున్న చెరుకూరి సత్యనారాయణను ఆంధప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.డి.ప్రసాద్, నెట్‌బాల్ సంఘం ప్రతినిధి శివరామ్, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్, జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్, టీడీపీ నాయకుడు నరసింహచౌదరి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రేమ్‌కుమార్, వెంకటరమణ, నాగేశ్వరరావు, రంగారావు, చెన్నకుమార్ పరామర్శించి సంఘీబావం ప్రకటించారు. చెరుకూరి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకూరి సత్యనారాయణకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
క్రీడా సంఘాల నాయకుల డిమాండ్