
ప్రపంచ శాంతి అందరి అభిమతం కావాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రపంచ శాంతి ప్రజలందరి అభిమతం కావాలని, అదే జైన మతం బోధిస్తుందని ప్రముఖ జైనగురువు ఆచార్య దేవేష్ శ్రీమద్ విజయ్ కుల్బోధి సూరీశ్వర్జీ అన్నారు. జైన సంఘాల అనుబంధ సంస్థ జితో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ నవకర్ మహామంత్ర దినోత్సవాన్ని విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. ప్రపంచ వ్యాపితంగా పలు నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఉపన్యాసాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం స్థానికంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జైన గురువు ఆచార్య దేవేష్ శ్రీమద్ విజయ్ కుల్బోధి సూరీశ్వర్జీ మాట్లాడుతూ ప్రపంచంలోని మానవులందరూ ఎటువంటి కష్టనష్టాలు లేకుండా, ఏ విధమైన ఈతిబాధలు లేని జీవితాలను గడపాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అన్ని జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఉద్బోధించారు. ప్రధానంగా ప్రజలందరూ పర్యావరణ ప్రేమికులు కావాలని, తద్వారా చుట్టూ ఉన్న సమాజాన్ని దైవ స్వరూపంగా చూడగలరని అన్నారు. సంస్థ విజయవాడ చాప్టర్ చైర్మన్ కమలేష్ ఫోలముతో మాట్లాడుతూ జైనులు వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాల్లోనూ తమదైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాకేష్ జైన్, ప్రధాన కార్యదర్శి మనీష్ జైన్, కోశాధికారి కుందన్మల్ గాంధీ, కార్యదర్శి, నవకార్ మహామంత్ర దినోత్సవ కన్వీనర్ ప్రవీణ్‌జైన్ రాంకా, కార్యదర్శి మనీష్ చాజ్జెడ్, మహిళా విభాగం చైర్‌పర్సన్ కాజల్ జైన్, చీఫ్ సెక్రటరీ ఛాయాజైన్, యువజన విభాగ చైర్మన్ రిషబ్‌జైన్, చీఫ్ సెక్రటరీ నిషా బాగ్రేచా తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ప్రపంచ నవకార్
మహామంత్ర దినోత్సవం
భారీగా హాజరైన జైన మతస్తులు

ప్రపంచ శాంతి అందరి అభిమతం కావాలి