
ధాన్యం కొనేవాళ్లే లేరు..
జిల్లా వ్యాప్తంగా రబీలో 19,985హెక్టార్లలో వరి సాగైంది. అయితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలలో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం, విజయవాడరూరల్ మండల పరిధిలో ముమ్మరంగా కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు అకాల వర్షాలు, మరో వైపు తేమ పేరుతో మిల్లర్ల వేధింపులు అక్కడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరబోసేందుకు జాగా లేక శ్మశానాల్లో ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ధాన్యం వర్షానికి తడిసిపోయి ఆరబెట్టేందుకు కూలీలు దొరక్క నరకయాతన పడుతున్నారు. తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే తాము ఒడ్డున పడతామని రైతులు వాపోతున్నారు.