
బెజవాడ టీడీపీలో అంతర్యుద్ధం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. లోక్‌సభ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కేశినేని శివనాథ్ (చిన్ని)కు పార్టీకి చెందిన శాసనసభ్యుల మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరడంలేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇసుక, బూడిద, మట్టి, గ్రావెల్, మద్యం అక్రమ వ్యాపారాలతో పాటు ఆయన వర్గీయుల దందాలు శృతిమించితుండటం అధిష్టానానికి సైతం తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా రిజర్వుడు స్థానం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సైతం తాడోపేడో తేల్చుకునే దశకు వెళ్లారు. సీఎం చంద్రబాబు శనివారం నందిగామ పర్యటన సందర్భంగా నేతల మధ్య విభేదాలు మరోసారి వీధికెక్కాయి. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు అనుమతించిన స్థానిక నాయకుల జాబితాతో పాటు సభావేదికపై ఆశీనులయ్యేందుకు అవకాశం కల్పించిన వారి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు భగ్గుమనడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బండి తిరుపతిరావు, ఆర్.ఎస్.ప్రసాద్, నూకాలమ్మ తదితర నాయకులను అనుమతించే విషయమై ఎమ్మెల్యే తంగిరాల విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబుకు ఆ రోజు ఉదయాన్నే ఫోన్‌చేసి ప్రశ్నించగా ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి అందిన జాబితాననుసరించి తాము నడుచుకున్నామని సీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహించిన సౌమ్య ‘స్థానిక ఎమ్మెల్యే నుంచి జాబితా తీసు కోరా? మా మాటకు విలువలేదా? దళిత ఎమ్మెల్యే అయినందున ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఆ మేరకు మీకేమైనా సూచనలు ఉన్నాయా?’ అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించడంతో తమకు ఏ దురుద్దేశాలు లేవని, అలాంటివి ఆపాదించవద్దని సీపీ కోరారనేది భోగట్టా. దీనిపై ఎంపీ కార్యాలయ కార్యదర్శి కిషోర్‌కు తంగిరాల సౌమ్య ఫోన్ చేసి ‘హెలిప్యాడ్ వద్దకు ఎవరెవరిని అనుమతించా లనే పేర్లు మీరెలా నిర్ణయిస్తారు? జాబితా ఖరారుకు మీరెవరు? దానిని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఎలా పంపారు?’ అంటూ విరుచుకుపడినట్లు తెలిసింది.
ఆలోచనలో ఎంపీ వర్గం
తంగిరాల సౌమ్య అంతగా ఆగ్రహించడానికి కారణం ఆమెను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా అనే కోణంలో ఎంపీ వర్గం ఆరా తీిసింది. మాజీ మంత్రి దేవినేని ఉమానే కారకుడని నిర్ధ్ధారించుకుని చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. విజయవాడ లోక్‌సభ పరిధిలో రెండు రిజర్వుడు శాసనసభా స్థానాల్లో ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, ఎంపీ చిన్ని వర్గాల మధ్య విభేదాలు ముదిరి పరస్పరం ఫిర్యాదులు, దాడుల వరకు చేరుకున్నాయి. చంద్రబాబు, లోకేష్‌తో కేశినేనికి ఉన్న సన్నిహిత సంబంధాలు, పితూరీల నేపథ్యంలో నందిగామలో హెలిప్యాడ్ వద్ద కొలికపూడి నమస్కరించినా సరే ముఖ్యమంత్రి దళిత ఎమ్మెల్యే వైపు కన్నెత్తి చూడకపోవడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పుడు నందిగామ ఎమ్మెల్యే కూడా ఎంపీ విషయంలో దాదాపు కొలికపూడి దారిలోనే నడుస్తున్నట్లు అర్థమవుతోంది. వీటన్నిటిని బట్టి తనను దళిత వ్యతిరేకిగా ముద్ర వేయించడానికి దేవినేని ఉమా బృందం గట్టిగా ప్రయత్నిస్తుందనే అనుమానాలు ఏంపీ శివనాథ్‌లో బలపడుతున్నాయి. ఆ అనుమానాలనే ఎంపీ తన ఆంతరంగీకుల వద్ద వ్యక్తంచేసి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
తాడోపేడో అంటున్న తంగిరాల కయ్యానికి కాలుదువ్విన కొలికపూడి దళిత ప్రజాప్రతినిధుల అంతర్మథనం వసంతతో మొదటి నుంచీ బూడిదే సెంట్రల్‌లోకి రానివ్వని బొండా శ్రీరాంతాతయ్యతో భీమవరం గట్టు పంచాయితీ ఎంపీతో గద్దె మినహా అందరిదీ అదే తీరు కేశినేని చిన్ని వైపు అధిష్టానం మొగ్గు
ఇతర
ఎమ్మెల్యేలతోనూ అదే తీరు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎంపీ చిన్నికి మధ్య బూడిద తకరారు భారీ ఎత్తునే ఉంది. బూడిద పంచాయితీ అధిష్టానం వద్ద జరిగింది. జగ్గయ్యపేట పరిధిలోని భీమవరం గట్టు వద్ద తకరారు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య పెద్దదే. జిల్లా పార్టీ అధ్య క్షుడు నెట్టెం రఘు రాం నేతృత్వంలో అక్రమంగా గ్రావెల్‌ను తరలింపజేస్తున్నారని ఎంపీపై శ్రీరాం తాతయ్య సోదరులు గుర్రుగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోకి ఎంపీని ఎమ్మెల్యే బొండా ఉమా ఆహ్వానించి అభివృద్ధి కార్యక్రమాలలో ఉమ్మడిగా పాల్గొన్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. రైతు బజార్లు, బీసెంట్ రోడ్డులో హాకర్లు తదితర అంశాల్లో ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో డూండీ రాకేష్, ఫతావుల్లా వంటి వారిని ఎంపీ ప్రోత్సహిస్తుండటం అక్కడి సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులకు మింగుడుపడటం లేదు. వ్యాపారవర్గాల వారితో డూండీ పేచీలు పెట్టుకుని దందాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. దీంతో అక్కడి కూటమి ఎమ్మెల్యే సుజనాచౌదరి సైతం ఎంపీపై విముఖతతో ఉన్నట్లు తెలు స్తోంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో మాత్రం ఎంపీకి కాస్తోకూస్తో సయోధ్య ఉందని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతుండటం విశేషం.