
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
జూపూడి(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని జూపూడి మద్యం దుకాణం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంట కాలువలో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు(45)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే. కిలేశపురం గ్రామానికి చెందిన జూటూరి నాగరాజు ఇంటికి శనివారం గుంటూరుకు చెందిన ఇద్దరు బంధువులు వచ్చారు. వారితో కలిసి మద్యం సేవించేందుకు ఆరోజు రాత్రి మద్యం దుకాణానికి వెళ్లారు. అర్థరాత్రి అయినా భర్త ఇంటికి చేరలేదని భార్య పిల్లలు ఆరా తీశారు. బంధువులతోపాటు గుంటూరు వెళ్లి ఉంటాడని భావించారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం పోలీసులు నాగరాజు కుటుంబసభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు భార్య చంద్రమ్మ, కుటుంబసభ్యులు కలసి గుంటూరు బంధువులను ఆరా తీసేందుకు ఫోన్‌చేయగా వారి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. రాతిక్వారీలో పనిచేసే నాగరాజు తన ఇద్దరు పిల్లలను చదివించి వెయిట్ లిఫ్టింగ్‌లో కోచింగ్ ఇప్పించాడు. పెద్ద కుమారుడు జూటూరి కోటేశ్వరరావు మూడేళ్ల కిందట జాతీయస్థాయి ఖేల్ ఇండియా పోటీల్లో పతకం సాధించాడు. కాయకష్టంతో బతికీడుస్తున్న కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు, ఈ మేరకు అతనిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగలురాత్రీ తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉండటంతో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.