జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

Apr 6 2025 2:33 AM | Updated on Apr 6 2025 2:33 AM

జగ్జీ

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, సంఘసంస్కర్త, రాజకీయవేత్త బాబు జగ్జీవన్‌రామ్‌ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి శనివారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. మహనీయుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్షను రూపుమాపడానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి నేటి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

‘పది’ మూల్యాంకన బడ్జెట్‌ కేటాయింపులు జరపాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పదో తరగతి మూల్యాంకన బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని డీపీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. శనివారం విజయవాడలో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ కేవీ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సకాలంలో పారితోషికాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ను కోరారు. శ్రీరామనవమి సందర్భంగా మూల్యాంకన విధులకు ఒకరోజు సెలవు ప్రకటించాలని కోరారు. డీపీఆర్టీయూ అభ్యర్థనపై డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ కేవీ శ్రీనివాసులు రెడ్డి సానుకూలంగా స్పందించారని శ్రీను తెలిపారు. మూల్యాంకన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని, సెలవు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఒక గంట పర్మిషన్‌ ఇచ్చారని శ్రీను తెలిపారు. మూల్యాంకన బడ్జెట్‌ విడుదలపై సానుకూలంగా స్పందించారన్నారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో డీపీ ఆర్టీయూ నేతలు అక్బర్‌ బాషా, కుమార్‌ రాజా, మధుకర్‌, ఎడం శ్రీను, సర్వేశ్వరరావు, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు దళితవాడల్లో శ్రీరామనవమి ఉత్సవాలు

విజయవాడకల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో టీటీడీ నిర్మించిన దేవాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మప్రచార పరిషత్‌ అసిస్టెంట్‌ సీవీకే ప్రసాద్‌ శనివారం తెలిపారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన గుడి – మన ప్రాంతం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో టీటీడీ 16 దేవాలయాలు నిర్మించిందన్నారు. ఆలయాల్లో పూజాదికాలు నిర్వహించడానికి టీటీడీ స్థానికులకే శిక్షణనిచ్చి, వారిచే ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఆయా ప్రాంతాల్లో శ్రీరాముని కల్యాణోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల కోసం తిరుపతి నుంచి వచ్చిన శ్రీవారి కంకణాలు, కుంకుమ, గోవిందనామాలు, భగవద్గీత పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. టీటీడీ పూజా కిట్‌ను పూజారులకు అందజేశారు. కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్‌ జిల్లా ధర్మప్రచారక్‌ జయశంకర్‌ పాల్గొన్నారు

అన్నప్రసాద వితరణ..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం 300 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో నంబూరి కై సాలనాథ్‌, వీరలక్ష్మి, అత్తిలి అంజలి పాల్గొన్నారు. టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ లలితా రమాదేవి పర్యవేక్షించారు.

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం 1
1/2

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం 2
2/2

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement