గన్నవరం: స్థానిక సబ్‌జైలును ఆదివారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కేవీ రామకృష్ణ సందర్శించారు. సబ్‌జైలులో ఖైదీల వివరాలను, వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్‌జైలులోని వంటిగది, ఖైదీల కోసం సిద్ధం చేసిన ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు సదుపాయలను కల్పించాలని చెప్పారు. ఖైదీల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.
కొత్త భవన సముదాయం నిర్మించాలి..
అనంతరం జిల్లా జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గారపాటి రవికుమార్, రామకూరి ప్రకాశరావు నేతృత్వంలో నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం స్థానంలో కోర్టుల కొత్త సముదాయం నిర్మించాలని కోరారు. అనంతరం అరుణసారికను బార్ అసోసియేషన్ కార్యవర్గం సత్కరించింది. ఉపాధ్యక్షుడు ఎల్. వేణుబాబు, కోశాధికారి ఆర్. విమల్‌కుమార్, మహిళా ప్రతినిధి భాగీరథీ పలువురు సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి అరుణసారిక