
చోడవరంలో నాగేంద్రస్వామి దేవస్థానం
పెనమలూరు: కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చోడవరం శ్రీలక్ష్మీనారాయణ సహిత శ్రీ నాగేంద్రస్వామి వారి ఆలయంలో నాగుల చవితి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు. 17వ తేదీన జరుపుకునే నాగుల చవితి పండుగకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ, దాతలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల క్రితం ఆగమశాస్త్ర పండితుడు వేదాంతం లక్ష్మణాచార్యులకు నాగేంద్రస్వామి కలలో కనిపించటంతో గ్రామంలో ఉత్తరాన ఉన్న పాపన్న చెరువు వద్ద నాగేంద్రస్వామివారిని ప్రతిష్టించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకునే వారు. నాగేంద్రస్వామిని నమ్మిన భక్తుల మొక్కులు తీరుతుండటంతో స్వామివారి పట్ల భక్తులకు అపార నమ్మకం ఏర్పడింది. దాతల సహకారంతో 1976లో ఆలయ నిర్మాణం చేశారు. ఆలయం నేడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది.
నాగుల చవితి కార్యక్రమాలు....
17వ తేదీ వేకువజాము నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 3 గంటలకు మంగళ వాయుద్యాలు, స్వామివారికి పట్టు వస్త్రాలతో విశేష అలంకరణ చేస్తారు. 6 గంటలకు చోడవరం, కాసరనేనివారిపాలెం, వల్లూరిపాలెం గ్రామాల మహిళా భక్తులచే శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, 7 గంటల నుంచి భజనలు చేస్తారు. దాతల సాయంతో భక్తులకు పుట్టలో పాలు పోయటానికి ఉచితం ఆవుపాలు, ఉచితంగా తీర్థప్రసాదాలు ఇస్తారు. భక్తులకు ఉచితంగా పులిహోర, మంచినీరు, మజ్జిగ పంపిణీకి సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేకంగా బారికేడ్లు, షామియానాలు, చలవ పందిళ్లు ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక పూజలు..
నాగులచవితి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం ధర్మకర్తలు వేదాంతం తిరునగరి వీరరాఘవకృష్ణశర్మ, తిరునగరి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, మంత్రపుష్పం, తదితర పూజా కార్యక్రమాలు చేస్తామన్నారు. భక్తులు పండుగ రోజు పుట్టలో పాలు పోసే సమయంలో ఇబ్బందులు పడకుండా నిర్వహకులతో సహకరించాలని కోరారు. ఆలయం వద్ద భజన, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి స్తామని భక్తులు తిలకించాలని కోరారు.
ప్రత్యేక బస్సులు..
ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల నుంచి 17వ తేదీ రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక బస్సులు విజయవాడ, పెనమలూరు సెంటర్ నుంచి ఆలయం వరకు తిరుగుతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
17వ తేదీ పండుగ నిర్వహణ
భక్తులకు అన్ని ఏర్పాట్లు

ఆలయంలో స్వామి