బిల్డర్‌ ఆత్మహత్య.. డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధమే కారణం | NTR District Builder Committed Suicide Due To His Wife Extra Marital Affair, Suicide Note Viral - Sakshi
Sakshi News home page

బిల్డర్‌ ఆత్మహత్య.. డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధమే కారణం

Oct 10 2023 1:44 AM | Updated on Oct 10 2023 12:33 PM

- - Sakshi

కృష్ణలంక(విజయవాడతూర్పు): కుటుంబ విభేదాలు, ఆస్తి గొడవల నేపథ్యంలో కృష్ణలంకకు చెందిన ఓ బిల్డర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరిగా బతకలేక అత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరికొంత మంది కారణమని సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఘటన కృష్ణలంక పీఎస్‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక నివాసి బిల్డర్‌ దాసరి హనుమంతరావు అలియాస్‌ అనిల్‌(60) అపార్ట్‌మెంట్స్‌ నిర్మించి విక్రయిస్తూ ఉంటాడు. ఇతనికి భార్య రాధాలక్ష్మి, కుమారుడు సిద్ధేష్‌కుమార్‌, కుమార్తె సౌజన్య ఉన్నారు.

కుమారుడు, కుమార్తె ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. అనిల్‌ కృష్ణలంకలోని శంకరమఠం సమీపంలో కుమార్తెకు చెందిన ఇంటిలోని నాలుగో అంతస్తులో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య రాధాలక్ష్మి కృష్ణలంక ఆర్చి రోడ్డులో తన సొంతింటిలో నివసిస్తోంది. దీంతో అనిల్‌ తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో సౌజన్య తన తండ్రి అనిల్‌కు ఫోన్‌ చేసింది. అతను లిఫ్ట్‌ చేయకపోవడంతో వాచ్‌మెన్‌కు ఫోన్‌ చేసి తన తండ్రి వద్దకు వెళ్లాలని చెప్పింది.

వెంటనే వాచ్‌మెన్‌ అనిల్‌ ఇంటిలోకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతను ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని, సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనిల్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో తనకు, తన భార్యకు విభేదాల కారణంగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నానని, తమ వద్ద పనిచేసిన డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనను మానసికంగా వేధించి ఆమె తన ఆస్తులన్నీ రాయించుకుందని తెలిపారు. తన చావుకు తన భార్య, ఆమెకు సహకరించిన బోనగిరి రాము, అరుణ అనే వారు కారణమని నోట్‌లో అనిల్‌ పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement