రైతులకు బోనస్ ఇవ్వొద్దనడం సరికాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులకు బోనస్ ఇవ్వొద్దంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులు పండించిన వరి, గోధుమలకు రూ.630 బోనస్ ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించాల్సిన కేంద్రం అందుకు భిన్నంగా బోనస్ ఇవ్వడానికి వీల్లేదంటూ కేరళ సీఎస్‌కు లేఖ రాసిందన్నారు. కేంద్రం లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన కేంద్రం, కేరళ రాష్ట్రం ఇస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.
అమెరికా ఒప్పందంపై సంతకం చేయొద్దు..
రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడి, ఫౌల్ట్రీ రంగం, పశుసంవర్థక, మత్స్య శాఖ తదితర రంగాలకు నష్టదాయకమైన భారత, అమెరికా ఉచిత వాణిజ్య ఒప్పందంపై సంతకాన్ని చేయవద్దని కేంద్రాన్ని కోరారు. మన పంటలకు సుంకాలు అమెరికా విధించటం, వారి పంటలేమో ఉచితంగా కొనుగోలు చేయటం ఏ పాటి ఒప్పందమని కేంద్రంపై మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతను కలుస్తాం..
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ రైతు సమస్యలపై ఈ నెల 27న సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ను కలుస్తామన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు, ఏఐకేఎఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నల్లమడ రైతు సంఘం నాయకుడు డాక్టర్ కొల్లా రాజమోహన్, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి, ఏఐఎస్ కేఎస్ కేంద్ర నాయకుడు జానకీరాములు, కిసాన్ సంఘటన్ రాష్ట్ర నాయకుడు మరీదు ప్రసాద్ బాబు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎస్కేఎం
రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోఽభనాద్రీశ్వరరావు


