యూకే, యూరోప్‌లో అంగరంగ వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు

TTD Srinivasa Kalyanotsavam success in the UK and Europe says Madapati s venkat - Sakshi

ఘనంగా  దేవదేవుడి కళ్యాణోత్సవాలు

యూకే, యూరోప్‌లో ఘనంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణోత్సవాలపై  ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు  వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. వివరాల్లోకి వెళితే, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు గత వారంలో మూడు (03) నగరాలలో జరిగాయి. నవంబర్ ౩వ తేదీన  జర్మనీలోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్ నగరాలలో తితిదే అర్చకులు, వేదపండితులు ఆ దేవదేవుడి కళ్యాణం వైఖానస ఆగమం ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఇప్పటివరకు 9 నగరాలలో శ్రీవారి కళ్యాణాలు జరిగాయి. 

మునిక్ నగరంలో వారం మధ్యలో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం నిర్వహించినా, భక్త సందోహంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు  భక్తి పరవశంతో పులకించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీ లో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీ పర్వతనేని  హరీష్ దంపతులు, స్థానిక మేయర్  పాల్గొన్నారు. కళ్యాణాన్ని ఆశాంతం తిలకించి, మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. పచ్చని ప్రకృతి, కొండల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి కళ్యాణం జరిగింది.  ఈ సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, తితిదే చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవం వీక్షించిన భక్తులకు ఇది చిరకాలం గుర్తుండిపోతుంది.  శ్రీ వెంకటేశ్వర సెంటర్  (ఫ్రాన్స్) సభ్యులు కన్నాబిరెన్ మాట్లాడుతూ...గతంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించినప్పటికీ ఇంతపెద్ద ఎత్తున స్వామి వారి కళ్యాణం జరగడం ఇదే మొదటిసారి అని, మాటల్లో వర్ణించలేని మహత్తర కార్యక్రమమని  సంతోషం వ్యక్తం చేసారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అన్ని నగరాలలో  భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు.

ఈ సందర్భంగా  వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ...కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్య ధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారన్నారు. ఈ వారంతంలో అనగా 12వ తేదీన పెద్దఎత్తున ఇంగ్లాండ్ లోని లండన్, 13వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్‌లో కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో యూకే యూరోప్ దేశాలలోని 11 నగరాలలో దేవదేవుడి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కన్నులపండువలా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. 

కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో శ్రీ వెంకటేశ్వర్లు, యూకే తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కిల్లి సత్య ప్రసాద్, శివాలయం ఈ.వీ. సెంటర్ శర్మ, తదితరులు (మునిక్, జర్మనీ), మన తెలుగు అసోసియేషన్, జర్మనీ- ఈ.వీ. సభ్యులు, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ (ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ) సభ్యులు మాణిక్యాంబ, జవాజి వెంకట కృష్ణ, వెంకటేశ్వర టెంపుల్ (పారిస్, ఫ్రాన్స్) సభ్యులు, ఆయా నగరాలలోని కార్యనిర్వాహకులు, తెలుగు, భారతీయ భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top