క‌రోనా కాలంలో పేద‌ల‌కు టీపాడ్ స‌హాయం

TPAD Helps Poor People In Bhadradri Kothagudem - Sakshi

కొత్త‌గూడెంలో కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన టీపాడ్‌

డ‌ల్లాస్‌: డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్) ప్ర‌తీ సంవత్స‌రం డల్లాస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘ‌నంగా జ‌రుపుతోంది. ప్ర‌తి వేస‌విలో వనభోజనాల కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలు, పండగలను పాశ్చాత్య దేశాలలో ప్ర‌తిబింబించేలా చేయడమే కాకుండా మ‌న‌ లలిత కళలకు జీవం పోస్తూ ఎంతో మంది క‌ళాకారుల‌కు గొప్ప వేదిక‌ను అందిస్తోంది. ప్ర‌తి ఏటా ర‌క్త‌దాన శిబిరాల‌తో పాటు ఇల్లు, నీడ లేని వారికి అన్న‌దానాలు చేస్తూ ఆస‌రాగా నిల‌బ‌డుతోంది. స్థానిక, జాతీయ సంస్థ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌కు చేదోడుగా, తోడు నీడ‌లా బాధ్య‌త‌లను త‌న భుజాల‌పై వేసుకుంటోంది. క‌రోనా లాంటి ఉప‌ద్ర‌వాలు వ‌చ్చిన‌ప్పుడు కూడా అమెరికాలోని ఆరోగ్య కేంద్రాల‌కు మాస్కులు, వైద్య‌ప‌రంగా కావాల్సిన సామాగ్రి స‌మ‌కూర్చ‌డ‌మే కాకుండా ఇండియా నుంచి వ‌చ్చిన విద్యార్థుల‌కు కూడా కావాల్సిన నిరంత‌ర స‌హాయం చేస్తూ ఉంది. (యూఏఈలో భార‌త స్వాతంత్ర్య‌ వేడుక‌లు)

టీపాడ్ సంస్థ చేసే క‌మ్యూనిటీ స‌ర్వీసెస్‌లో భాగంగా ఇండియాలోనూ క‌రోనా వైర‌స్ విప‌రీతంగా ప్రబ‌లుతున్న కార‌ణంగా చాలామంది నిరుపేదలు ఉపాధి కోల్పోయారు. ఈ క్ర‌మంలో భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో కొత్త‌గూడెంలో వారు జీవించ‌డానికి నిత్యావ‌స‌రాలు కూడా స‌మ‌ర్చుకోలేని స్థితిలో ఉన్నార‌ని తెలిసి టీపాడ్ సంస్థ కార్య‌ద‌ర్శి అనురాధ మేక‌ల‌, కొత్త‌గూడెం గ్రామ‌స్థులైన స‌తీష్‌, జ్యోతి, కాల్వ సుధాక‌ర్‌, అక్ర‌మ్‌, షాబుద్దీన్‌, శ్రీనివాస్‌, నాగ‌రాజు, స్వ‌రూప‌, సుజాత‌, మ‌ల్లేశ్వ‌రి త‌దిత‌రులను సంప్ర‌దించి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో 25 కుటుంబాల‌కు ఒక మాసానికి స‌రిప‌డే నిత్యావ‌స‌ర వ‌స్తువులు విరాళంగా అందించారు. టీపాడ్ సంస్థ ఫౌండింగ్ క‌మిటీ చైర్ రావు క‌ల్వ‌ల, బోర్డు ఆఫ్ ట్ర‌స్టీస్ చైర్ మాధ‌వి సుంకిరెడ్డి, కో ఆర్డినేట‌ర్ బుచ్చిరెడ్డి గోలి, అధ్య‌క్షులు ర‌వికాంత్ రెడ్డి మామిడి, కార్య‌వ‌ర్గ బృందానికి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్‌, గ్రామ‌స్థులు హృదయ‌పూర్వ‌క  కృతజ్ఞ‌త‌లు తెలిపారు. (డల్లాస్‌ తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ బృందం..)

టీపాడ్ నాయ‌కత్వం, సంస్థ కార్య‌వ‌ర్గ ‌బృందంతో క‌లిసి కోవిడ్ ఆప‌ద స‌మంలో నారాయ‌ణ పేట జిల్లా న‌ర్వ మండ‌లంలో ప్ర‌భుత్వ కార్యాల‌‌యాల్లో, వివిధ విభాగాల్లో నిరంత‌రం సేవ‌లందిస్తున్న వారికి దాదాపు వెయ్యి డాల‌ర్ల విలువైన ఎన్‌-95 మాస్కులు, శానిటైజ‌ర్ల పంపిణీ చేశారు. త‌రువాత ఆంధ్రప్ర‌దేశ్‌లో కృష జిల్లా కూచిపూడి గ్రామంలో 20 కుటుంబాల‌కు ఒక నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశారు. అదే విధంగా కొత్త‌గూడెంలో కూడా 25 కుటుంబాల‌కు ఈ స‌హాయ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నందుకు, ఆప‌ద‌లో ఉన్న‌వారికి చేయూత‌ను ఇస్తున్నందుకు త‌మ‌కెంతో సంతృప్తిని కలుగజేసిందని తెలియజేశారు. మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top