టాంటెక్స్‌ సంక్రాంతి సంబరాలు

Tantex Sankranti Celeabrations - Sakshi

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌) సంక్రాంతి సంబరాలు 2022 జనవరి 29న శనివారం  డల్లాస్‌లోని తోమా ఈవెంట్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడేలా ఆటపాటలతో రంగురంగుల ముగ్గులతో ఎంతో ఉ‍త్సాహభరితంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టాంటెక్స్‌  2021  అధ్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి గారు ప్రసంగిస్తూ.. టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు, సాంకేతిక శిక్షణలు నిర్వహించామన్నారు. కరోనా టైంలో వర్కువల్‌ ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. 2022 పాలక మండలికి తన వంతు సహకారం ఉంటుందన్నారు.

2022 అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి మాట్లాడుతూ... ఈ ఏడాది మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆటల పొటీలు, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించబోతున్నట్టు భవిష్యత్‌ కార్యాచరణ వివరించారు. నూతన కార్యవర్గ బృందాన్ని ఒక చక్కటి గేయంతో సభకు పరిచయం చేశారు. టాంటెక్స్‌ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటిల ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 

ఉత్తరాధ్యక్షుడుగా శరత్ రెడ్డి ఎర్రం, ఉపాధ్యక్షులుగా సతీష్ బండారు, కార్యదర్శిగా సురేష్ పఠనేని, కోశాధికారిగా సుబ్బారెడ్డి కొండు, సంయుక్త కోశాధికారిగా భాను ప్రకాష్ వెనిగళ్ల ను పరిచయం చేసారు. పాలక మండలి అధిపతి వెంకట్ ములుకుట్ల గారు మరియు ఉపాధిపతి అనంత్ మల్లవరపులు ప్రసంగిస్తూ.. అందరికీ 2022 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంక్రాంతి సంబరాలను చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల వినాయకుడి మీద ప్రార్ధనా గీతంతో మొదలుపెట్టారు. కూచిపూడి కళాక్షేత్రకు చెందిన పిల్లలు సూర్య భగవానుడికి తమ కూచిపూడి నృత్యం ద్వారా ఆదిత్య పుష్పాంజలి సమర్పించారు. లాస్య సుధా అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సాయి నృత్య అకాడమీ స్కూల్ ఆఫ్ కూచిపూడికి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్యం ద్వారా అన్నమయ్య కీర్తనలకు, వందేమాతరంకు నర్తించారు. లాస్య సుధా అకాడమీకి చెందిన చిన్నారులు భరతనాట్యంతో  "సరసిజాక్షులు - కృష్ణ శబ్దం"ను ప్రదర్శించారు. కార్తి గ్రూప్, యూ డాన్స్ టీం, దేశి ఇల్యూషన్ గ్రూప్‌కి చెందిన పిల్లలు తెలుగు సినీచిత్ర గీతాలకు నర్తించి అందరినీ అలరించారు. డాలస్‌కి చెందిన కళాకారులు ప్రభాకర్ కోట, చక్రపాణి కుందేటి, శారద చిట్టిమల్ల, స్నిగ్ఢ ఏలేశ్వరపు తమ పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన శ్రీనివాసులు బసాబత్తిన, మధుమతి వైశ్యరాజు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను గుర్తు చేసుకుంటూ పిండి వంటలు, గొబ్బెమ్మలు, గాలి పటాలు, ఎద్దుల పోటీలు, హరిదాసులు, గంగిరెద్దులు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొత్తగా భాద్యతలు స్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి మాధవి లోకిరెడ్డి ఎంతో నేర్పుగా సమయస్ఫూర్తితో కార్యక్రమాలని ముందుకు నడిపించారు. కార్యక్రమ సమన్వయకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి, పొషక దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top