మరుగున పడుతున్న లలిత గీతాలను 'తానా' పరిరక్షిస్తుంది

International Video Conference Hosted By TANA World Literary Forum - Sakshi

డల్లాస్, టెక్సాస్ - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో 'లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు' అనే అంశంపై ప్రముఖ గీత రచయితలు, గాయనీ గాయకులు వేదవతి ప్రభాకర్, డా. ఎంకే రాము, డా. ఓలేటి పార్వతీశం, డా. వడ్డేపల్లి కృష్ణ, కలగా క్రిష్ణమోహన్, వారణాసి నాగలక్ష్మి మొదలగువారు పాల్గొని వివిధ అంశాలను స్పృశించి అనేక మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయకులు, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరి రామాచారి లలిత గీతాలకు తాను ఇస్తున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తన శిక్షణలో తయారవుతున్న గాయనీ, గాయకులచే వేలకొద్దీ లలిత గీతాలను పాడిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయని వేదవతీ ప్రభాకర్ ‘లలిత గీతాల స్వర్ణయుగం’ అనే అంశంపై స్పందిస్తూ తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో కలసి పనిచేసిన సుప్రసిద్ధ రచయితలు, గాయనీ గాయకుల విశేష కృషిని వివరించారు. ప్రముఖ సంగీత దర్శకులు పాలగుమ్మి విశ్వనాథం రచించి, స్వరపరచిన 'అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ' అనే గీతాన్ని పాడి అందరినీ అలరించారు.  

కార్యక్రమంలో ప్రముఖ కవి, రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎంకే రాము మాట్లాడుతూ.. తాను రచించిన అనేక వందల లలిత గీతాలను, ఎంతోమంది సినీ, సాహిత్య ప్రముఖులతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. వివిధ ప్రసార మాధ్యమాలలో ముప్పైతొమ్మిది సంవత్సరాలకు పైగా విశేషానుభవం గడించిన సాహితీవేత్త, ప్రముఖ కవి డా. ఓలేటి పార్వతీశం దూరదర్శన్‌లో తొలినాళ్లలో లలిత గీతాలు ప్రసారం కావడం నుంచి, నేటివరకు సాగుతున్న పరిణామక్రమాన్ని ఆసక్తికరంగా వివరించారు. 'తెలుగులో లలిత గీతాలు' అనే అంశంపై ప్రామాణిక పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సాహితీవేత్త లలితగీత, సినీగీత రచయిత, సినీదర్శకులు డా. వడ్డేపల్లి కృష్ణ దశాబ్దాల సినిమా చరిత్రలో లలిత గీతాలు సినీ గీతాలుగా రూపుదిద్దుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు. ఆకాశవాణితో ఐదు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం ఉన్న ఆకాశవాణి ఉత్తమ శ్రేణి కళాకారులు, ప్రముఖ గీతరచయిత, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్ సంగీత ప్రపంచంలో దిగ్గజాల లాంటి మహానుభావులు ఎందరితోనో పని చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
 
ప్రముఖ చిత్రకారిణి, కథా, లలితగీత రచయిత్రి వారణాసి నాగలక్ష్మి లలితగీత సాహిత్య ప్రపంచంలో అలనాటి సుప్రసిద్ధ రచయితలతో పాటు వర్తమానంలో రాస్తున్న రచయితలు, వారి సాహిత్య కృషిని వివరించారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు కొమండూరి రామాచారి తన గాన ప్రస్థానం లలిత గీతాలతోనే ప్రారంభం అయిందని, అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మంది సాహితీవేత్తల సృజనను స్వరపరచి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతోమంది గాయనీ, గాయకుల గాత్రాల ద్వారా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీద పాడించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామాచారి శిక్షణలో తమ గాత్రసౌరభానికి మెరుగులు దిద్దుకుంటున్న సరస్వతీ చైతన్య (వర్జీనియా), బేబీ శరణ్య వక్కలంక (వర్జీనియా), నాగ సాహితి (కాలిఫోర్నియా), శివాని సరస్వతుల (జర్మనీ), సౌజన్య గరిమెళ్ళ (నెదర్లాండ్స్), శరత్ చంద్ర ఏడిద (బహరేన్), స్వాతి ఎల్లూరి(బహరేన్), భారతదేశం నుంచి శ్రీ సౌమ్య వారణాసి, శరత్ సంతోష్, భరత్ రాజ్, జయరాం పైల, జీవీ ఆదిత్య, సాకేత్ కొమ్మాజోశ్యుల, శ్రియా మాధురి పోపూరి, మేఘనా నాయుడు,శ్రీపాద ఉప్పులూరి మొదలైనవారు తమ గాత్ర మాధుర్యంతో అందరినీ అలరించారు.
 
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 'సంగీత, సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలైన బాలాంత్రపు రజనీకాంత రావు, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు,చిత్తరంజన్, మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వింజమూరి అనసూయ, వింజమూరి సీత, జగన్నాధాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా. సీ నారాయణ రెడ్డి, దాశరధి, బోయి భీమన్న, పాలగుమ్మి విశ్వనాధం, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, డా. గుంటూరు శేషంద్ర శర్మ, నేదునూరి కృష్ణమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆచార్య తిరుమల, కోపెల్ల శివరాం, అఖ్మల్ హైదరాబాది లాంటి ప్రముఖల విశేష కృషిని, ఈ సభ ద్వారా స్మరించుకుని వారికి నివాళులర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లలిత గీతాల పునర్ వైభవానికి తానా సంస్థ కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, గాయనీ గాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లలిత గీతాలు మరుగున పడుతున్న ఈ కాలంలో వాటి పరిరక్షణకు తానా చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top