టెక్సాస్‌లో దారుణం.. ఇండియన్‌ స్టూడెంట్‌కి వేధింపులు

Indian Boy Bullied In US TEXAS - Sakshi

Indian Student Bullied Texas: భారతీయ మూలాలున్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అమెరికన్‌ స్టూడెంట్‌ రెచ్చిపోయాడు. మాటలతో వేధిస్తూ భౌతికదాడులకు దిగుతూ హింసించాడు. స్కూల్‌ క్యాంటీన్‌లోనే దురాగతం జరుగుతున్నా ఎవ్వరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా కొందరు విద్యార్థులు విపరీత చేష్టలకు పాల్పడుతున్న అమెరికన్‌ విద్యార్థిని రెచ్చగొట్టారు. 

ఈ దారుణమైన ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో కాపెల్‌ ప్రాంతంలో ఉన్న కాపెల్‌ మిడిల్‌ స్కూల్‌లో చదువుతున్న భారతీయ మూలాలున్న విద్యార్థికి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాంటీన్‌లో తింటున్న సమయంలో.. ఓ అమెరికన్‌ విద్యార్థి అక్కడకు వచ్చి ఇండియన్‌ స్టూడెంట్‌ని అతను కూర్చున్న చోటు నుంచి లేచి వేరే దగ్గరికి వెళ్లి పోవాలంటూ దబాయించాడు. ఎవరూ లేని సమయంలో తాను అక్కడ కూర్చున్నానని,.. తాను అక్కడి నుంచి లేచి వెళ్లనంటూ ఆ ఇండియన్‌ స్టూడెంట్‌ తెలిపాడు. పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చోవాలంటూ సూచించాడు.

మాటలతో మొదలెట్టి..
ఇండియన్‌ ఆరిజిన్‌ స్టూడెంట్‌ చేసిన సూచనలు పట్టించుకోకుండా.. కచ్చితంగా నువ్వా కుర్చీలో నుంచి లేచిపోవాల్సిందే అంటూ అమెరికన్‌ విద్యార్థి ఇండియన్‌ స్టూడెంట్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్కూల్‌బ్యాగు తీసి పక్కన పడేశాడు. తన వేలితో మెడపై పొడుస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. ఐనప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన భారతీయమూలాలు ఉన్న విద్యార్థి అక్కడి నుంచి లేచేందుకు అంగీకరించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అమెరికన్‌ స్టూడెంట్‌.. ఇండియన్‌ స్టూడెంట్‌ మెడ చుట్టూ చేయి వేసి తలను మెలిపెట్టి కుర్చీ నుంచి లాగి నేలపై పడేశాడు. 

రెచ్చగొడుతూ
వందల మంది విద్యార్థుల సమక్షంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ భారతీయ మూలాలున్న విద్యార్థికి మద్దతుగా రాలేదు సరికదా కొందరైతే దురాగతానికి పాల్పడుతున్న అమెరికన్‌ స్టూడెంట్‌ను రెచ్చగొట్టారు. మరికొందరు జరుగుతున్న ఘటన వీడియో తీస్తూ గడిపారు.

బాధితుడికే శిక్ష
ఈ నెల 11న ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే విషయం స్కూల్‌ ప్రిన్సిపల్‌ వరకు వెళ్లింది. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించాడు. వీడియోలో కనిపిస్తున్న దురాగతానికి విరుద్దంగా భారతీయ విద్యార్థే అకారణంగా మరో విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడని నిర్థారిస్తూ.. బాధిత విద్యార్థిని మూడు రోజుల పాటు స్కూల్‌ నుంచి సస్పెండ్‌ చేయగా దాడికి పాల్పడిన అమెరికన్‌ స్టూడెంట్‌కి కేవలం ఒక రోజు నుంచి నుంచి సస్పెండ్‌ చేశారు.

వరుస ఘటనలు
సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తామని పదే పదే చెప్పుకునే అమెరికాలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇండియన్లను నివ్వెరపరుస్తోంది. ఇదే వారంలో నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని షికాగోలని బఫెలో మార్కెట్‌లో కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు.

చదవండి: బుసకొట్టిన జాతి విద్వేషం

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top