కామారెడ్డి టౌన్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఉద్యోగులు దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ‘మా కష్టంతో ప్రజారోగ్య దీపాన్ని వెలిగించాం.. మా బతుకుల దీపానికి భద్రత అడుగుతున్నాం’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు. సమ్మె శిబిరాన్ని తెలంగాణ రచయితల వేదిక నాయకులు గఫూర్ శిక్షక్,గంగా ప్రసాద్, సంధ్యారాణి, సావిత్రిలు సందర్శించి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుమన్, నాయకులు అశ్విని, వేణుమాధవ్, రాహుల్, మౌనిక, మీనాక్షి, చంద్రకాంతం, జ్యోతి, సుశీల, అఖిల్, సుకన్య, శేఖర్, లింగం తదితరులు పాల్గొన్నారు.


