నవీపేట/ మాక్లూర్: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శనివారం తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. యూరియా యాప్‌తో సకాలంలో యూరియా అందక రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్, నాయకులు కిషన్, గంగాధర్ పాల్గొన్నారు.
ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెట్టిన యూరియా యాప్‌లో బుక్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే యూరియా ఖాళీ అవుతుందని మండిపడ్డారు. కల్లెడికి 300 సంచుల యూరియా వస్తే అవసరం అయ్యే రైతులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడంపై రైతులు మండిపడుతూ కొద్ది సేపు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. వెంటనే యాప్‌ను తొలగించి ప్రతి ఎరువుల దుకాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చే శారు.


