యూరియా బుకింగ్ కష్టాలు
● కొత్త పాస్‌బుక్ లేని రైతులకు తిప్పలు
● ప్రత్యామ్నాయం చూపాలని
కర్షకుల వేడుకోలు
ఇందల్వాయి: పంటల సాగు కోసం రైతులకు యూరియా సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘ఫెర్టిలైజర్ యాప్’ ఇబ్బందులకు గురిచేస్తోంది. మొన్నటి వరకు సాంకేతిక కారణాలు రాగా, ప్రస్తుతం భూమి ఉండి కొత్త పాస్‌బుక్ అందని రైతులు బుకింగ్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో యూరియా దొరికే పరిస్థితి లేకుండా పోయింది.
జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వేల ఎకరాల భూములకు ఇప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాస్‌బుక్‌లు లేవు. అసైన్డ్ భూములు, అటవీ సరిహద్దు పరిష్కారం కాని, ధరణి వెబ్‌సైట్‌లో నమోదు కాని భూములకు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో పట్టాలు లేవు. అయితే, ప్రస్తుతం అలాంటి వారు యూరియా బుకింగ్ చేసుకోలేక, సకాలంలో పంటలకు వేయలేక ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రైతుల పట్టా పుస్తకాలపై ఆధారపడుతున్నారు.


