పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 బడులకు పీఎంశ్రీ పథకం కింద నిధులు మంజూరైనట్లు తెలిపారు. వీటిని వెచ్చిస్తూ ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా చొరవ చూపాలని కలెక్టర్ అన్నారు. అవసరమైన చోట తరగతి గదులు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఎం శ్రీ నిధులు వెనక్కి మళ్లిపోకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కాగా, పీఎంశ్రీ నిధుల వినియోగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేందర్ కుమార్ రాయ్ నేతత్వంలోని బృందం ఈనెల 27, 28 తేదీలలో జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఈవో అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


