అంకితభావంతో వైద్య సేవలందించాలి
● వైద్యారోగ్యశాఖ పనితీరుపై
నిరంతర పర్యవేక్షణ
● సమయ పాలన పాటించాలి
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్ : పేదలకు వైద్య చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ అంకిత భావంతో మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులకు, సిబ్బందికి హితవు పలికారు. వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ గురువారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోయినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేకపోతే అది ప్రజాజీవనంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. మాతాశిశు మరణాలకు అవకాశం లేకుండా ముందు నుంచే గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ నర్సింగ్ హోంలలో కూడా సాధారణ ప్రసవాలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పాల్గొన్న వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు
అంకితభావంతో వైద్య సేవలందించాలి


