జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్‌లు
ఖలీల్‌వాడి: తెలుగు, హిందీతోపాటు ఉర్దూ భాషల్లో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పండిత్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జమీలుల్లా పేర్కొన్నారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2న మండల స్థాయి, 3న ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు ప్రతిభా పాటవ పోటీలలో పాల్గొనాలని తెలిపారు. మొదటి, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి ద్వారా ప్రశంసాపత్రం అందించి సన్మానిస్తామని చెప్పారు. అనంతరం జిల్లాస్థాయిలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కేవీ రమణాచారి, మహిళా అధ్యక్షురాలు శివ నాగమణి, రాష్ట్ర బాధ్యులు శాలి అరుణోదయ, గంట్యాల ప్రసాద్, కోశాధికారి సతీశ్ వ్యాస్, జిల్లా ఉపాధ్యక్షులు బి. ప్రవీణ్ కుమార్, శ్రీమన్నారాయణ చారి, ఏ.శ్రీనివాస్, పెంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


