నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ రవీందర్ సాగర్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు తుది విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారి సందేహాలను ఆయన నివృత్తిచేశారు. అనంతరం రవీందర్ సాగర్ మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే వారి వివరాలు ఎప్పటికపుడు యాప్‌లో నమోదు చేయాలన్నారు. అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డివిజన్‌కు ఒక ఆఫీసర్‌ను నియమించామని, నగరవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 3 డివిజన్లకు ఒకటిచొప్పున కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. శిక్షణలో ట్రైనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


