సీఎం కప్ క్రీడా పోటీలకు నిధుల కొరత!
మోర్తాడ్(బాల్కొండ): సీఎం కప్ క్రీడా పోటీలకు నిధుల కొరత వేధిస్తోంది. గతేడాది క్రీడా పోటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అధికార యంత్రాంగం దాతల సహకారంతో నిర్వహించింది. ఈసారి క్రీడా పోటీలు ఆరంభమైనా నిధుల జా డ లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. కేవలం టార్చ్ ర్యాలీ కార్యక్రమానికి ప్రతి మండలానికి రూ.5 వేల చొప్పున నిధులను విడుదల చేశారు. దీంతో శనివారం అన్ని గ్రామాలలో క్రీడా పోటీలను ఆరంభించారు. ఎక్కువ చోట్ల క్రీడాకారులను నామమాత్రంగానే ఎంపిక చేసి మండల స్థాయికి పంపించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచిస్తున్నారు. గ్రామీణ స్థాయి కీడ్రా పోటీలను ఈ నెల 22 వరకు, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది.
రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు..
సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా గ్రామీణ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్ విచక్షణాధికారంతో మరో గ్రామీణ క్రీడను నిర్వహించేందుకు అవకాశం ఉంది. మండల స్థాయిలో చెస్, కరాటే, క్యారమ్స్ అదనంగా చేర్చారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రం 22 నుంచి 25 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.అయితే, మండల స్థాయిలో నిర్వహించే పోటీలకు కనీసం రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చు అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు నిధులు అవసరం. గతంలో కేవలం మండల స్థాయిలో క్రీడాపోటీల నిర్వహణకు రూ.20 వేల చొప్పున నిధులు ఇచ్చినా సకాలంలో మంజూరు చేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
టార్చ్ ర్యాలీల కోసం నిధులిచ్చాం..
టార్చ్ ర్యాలీ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి మండలానికి రూ.5 వేల చొప్పున ని ధులను విడుదల చేశాం. త్వ రలో మండల స్థాయి పోటీలకు నిధులు మంజూరు కానున్నాయి. ఈసారి ఎంతో ఉత్సాహంగా క్రీడాపోటీలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. నిధుల కొరత తీరుతుంది.
– పవన్, జిల్లా క్రీడల అధికారి
గతంలో దాతల సహకారంతోనే
నిర్వహించిన అధికారులు
ఈసారి నిధులు కేటాయిస్తామని
ప్రకటించినా.. ఇంకా విడుదల
కాని వైనం


