వే‘గంగ’ కిందకు..
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడం మొదలైంది. నీటి వినియోగం పెరగడంతో ‘గంగమ్మ’ వేగంగా కిందకు వెళ్తోంది. వరినాట్లు చివరిదశకు చేరుకోవడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. దీంతో నవంబర్ నెలలో 5.40 మీటర్ల లోతులో ఉన్న జలాలు డిసెంబర్ ముగిసే నాటికి 1.80 మీటర్ల మేర తగ్గి 7.20 మీటర్ల లోతులోకి వెళ్లాయి. ఇది 2024 డిసెంబర్ (8.92 మీటర్లు)తో పోలిస్తే మెరుగైన పరిస్థితే అయినప్పటికీ నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వేసవి సమయంలో నీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీనివాస్‌బాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు. అవసరం మేరకే వ్యవసాయ, గ్రామ పంచాయతీ, గృహావసరాల బోర్లను వినియోగించాలని రైతులను, ప్రజలను, గ్రామ పంచాయతీల అధికారులను కోరారు. నీటిని వృథా చేయొద్దన్నారు. డిసెంబర్ మాసానికి సంబంధించిన భూగర్భ జలాల లెక్కలను ఇటీవల గ్రౌండ్‌వాటర్ డిపార్ట్‌మెంట్ సేకరించింది. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా నీటి లెక్కలను తీసింది. ఇందులో 64 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 16 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా రెండు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే.. జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలలో 92శాతం విస్తరించి ఉన్న జలాలు డిసెంబర్ ముగిసే సమయానికి 85 శాతానికి తగ్గాయి. భీమ్‌గల్, సిరికొండ, నవీపేట్, డిచ్‌పల్లి, మోపాల్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు కిందికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
మే 12.48
జూన్ 11.49
జూలై 11.76
ఆగస్టు 8.48
సెప్టెంబర్ 6.03
అక్టోబర్ 5.58
నవంబర్ 5.40
డిసెంబర్ 7.20
2025లో నెలల వారీగా భూగర్భ జలాలు (మీటర్లలో)
తగ్గుతున్న భూగర్భ జలాలు
డిసెంబర్ ముగిసే నాటికి
7.20మీటర్ల లోతులో నీటి మట్టం
నవంబర్ నెలతో పోలిస్తే
1.80 మీటర్ల మేర తగ్గుదల


