రిజిస్ట్రేషన్ లేని డయాగ్నొస్టిక్ సెంటర్లు సీజ్
● అనుమతి లేకుండా చికిత్స అందిస్తే
కఠిన చర్యలు
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
సుభాష్‌నగర్: నగరంలో రిజిస్ట్రేషన్ లేకుండా డ యాగ్నొస్టిక్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజ శ్రీ కొరఢా ఝుళిపించారు. వినాయక్‌నగర్‌లోని అపరాజిత డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ఆమెతోపాటు సీఈ ఏ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. అనుమతి లేకుండా నడుస్తున్న కేంద్రాన్ని ఆమె సీజ్ చేశారు. అందులోనే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌ను నడిపిస్తూ, అదే గదిలో అనుమతి లేని డయాగ్నొస్టిక్ కేంద్రం నడుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. అర్హత లేని వ్యక్తి యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లుయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్నట్లు పూర్తి ఆధారాలతో పట్టుకున్నామన్నారు. అనుమతి లేకుండా, అర్హత లేని వ్యక్తులు అల్లోపతిక్ మందుల ద్వారా చికిత్స చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. దుబ్బ చౌరస్తాలోని నిత్య ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వ్యక్తి ఐవీ ద్వారా చికిత్స చేస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సీజ్ చేశారు. ఆయన వద్ద ఉన్న మందులను గుర్తించారు. చికిత్స చేసే అర్హత లేని వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. అనుమతి తీసుకున్న తర్వాతే ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు నడిపించాలని, అనుమతి లేకుండా నడుస్తున్న మరికొన్ని కేంద్రాలను గుర్తించామని ఆమె తెలిపారు. తనిఖీల్లో వైద్యులు సుప్రియ, శిఖర, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


