
నిజామాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది.
అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్‌వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్‌కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు.