రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
భైంసాటౌన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం పట్టణంలోని సాత్‌పూల్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ‘ఎరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందన్నారు. భైంసాలోని సాత్ పూల్ వంతెన వద్ద ప్రమాద సూచికలు లేకపోవడంతో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారని గుర్తుచేశారు. కార్యక్రమంలో భైంసా, నిర్మల్ ఏఎస్పీలు రాజేశ్ మీనా, సాయికిరణ్, సీఐలు సాయికుమార్, ప్రవీణ్, ఎస్సైలు పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
భైంసాటౌన్: పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణిలో భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో ‘షీ టీం’ సేవలను పరిశీలించారు.
హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి
కుభీర్: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో 35 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 162 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 80 శాతం హెల్మిట్ ధరించని వారే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు, నాయకులు ఎస్పీని సన్మానించారు. కుభీర్‌కు చెందిన శిల్పకళాకారుడు సాయిశ్యాం ఎస్పీ విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేశ్, సీఐ ప్రవీణ్, ఎస్సై క్రిష్ణారెడ్డి, సర్పంచ్ కె.సాయినాథ్, మారుతి, సంజు, ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, ఆత్మ చైర్మన్ వివేక్, తదితరులు పాల్గొన్నారు.


