అయ్యో అశ్విన్..!
నిర్మల్‌రూరల్: మూడేళ్ల వయసున్న కొడుకు.. ఏడాదిన్నర కూతురు ఉన్న ఆ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం నిర్మల్‌కు వలస వచ్చింది. పట్టణంలోని భాగ్యనగర్‌లో నివాసం ఉంటోంది. ఈనెల 10న ఇంటిముందు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఇంట్లో ఉన్న తల్లి ఆడుకుంటున్నాడనే అనుకుంది. కానీ, చీకటి పడినా లోపలికి రాకపోవడంతో బయటకు వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. చుట్టుపక్కల గాలించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడ ఉన్నా తిరిగి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రులకు శనివారం గుండెలు పగిలే వార్త అందింది. ఇంటి సమీపంలోని కందకంలోనే బాలుడు విగత జీవిగా కనిపించాడు. దీంతో నీకేమైంది బిడ్డా అంటూ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా లక్షోట్టిపేటకు చెందిన అనిల్–చంద్రిక దంపతులకు అశ్విన్(3), ఏడాదిన్నర వయసున్న కూతురు ఉన్నారు. ఐదు నెలల క్రితం అనిల్ కుటుంబంలో కలిసి ఉపాధి కోసం నిర్మల్‌కు వచ్చాడు. పట్టణంలోని భాగ్యనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అనిల్ స్థానిక కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈనెల 10న అనిల్ పనికి వెళ్లాడు. చంద్రిక ఇంట్లో ఉండగా, సాయంత్రం అశ్విన్ బయట ఆడుకుంటున్నాడు. చీకటి పడినా ఇంటికి రాలేదు. దీంతో తల్లి వెళ్లి చూడగా ఆచూకీ కనిపించలేదు. చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేదు. దీంతో అనిల్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి గాలించాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
కందకంలో విగత జీవిగా..
కొడుకు క్షేమంగా వస్తాడని చూస్తున్న తల్లిదండ్రులకు ఇంటి సమీపంలోనే శవమై ఉన్నాడని శనివారం సమాచారం అందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఘటన స్థలానికి వెళ్లి అయ్యో అశ్విన్ ఎంత పని చేస్తివి బిడ్డా అంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్పీ జానకీ శర్మిల, టౌన్ సీఐ నైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, పొరుగువారి నుంచి సమాచారం సేకరించారు. తల్లిదండ్రులు తమకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. అయినా ఎస్పీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి వస్తువులను ఫొరెన్సిక్‌ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయాడా... లేక ఎవరైనా పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


