సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మామడ: మామడ మండలం పొన్కల్ సమీపంలోని గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బ్యారేజీని సందర్శించి అధికారులతో సమీక్ష చేశారు. బ్యారేజీ ప్రాంగణం, హెలీప్యాడ్‌ను పరిశీలించి సరైన రోడ్డు సౌకర్యం ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. బ్యారేజీ పరిసర ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, ఎకై ్సజ్ అధికారి రజాక్, అగ్నిమాపకశాఖ అధికారి ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు చేపట్టాల్సిన ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, టెంట్, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


