పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే | - | Sakshi
Sakshi News home page

పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే

Jan 12 2026 7:59 AM | Updated on Jan 12 2026 7:59 AM

పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే

పాతవి పెంచలే.. కొత్తవి ఇయ్యలే

● చేయూత పింఛన్లకు అర్హుల నిరీక్షణ ● రెండేళ్లయినా పెరగని పెన్షన్‌ మొత్తం ● ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ● కొత్త పింఛన్లకు ఏళ్లుగా ఎదురుచూపులే

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిచేపోయింది. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు 58 ఏళ్లు నిండిన అర్హులు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చి నెలలు గడుస్తున్నా కొత్త పింఛన్ల ఊసేలేదు. పాతవి పెంచుతారని, కొత్తవి మంజూరు చేస్తారని.. ఎంతో ఆశగా ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిచేయి చూపింది.

నిరాశలో పింఛన్‌దారులు

చేయూత పింఛన్‌ లబ్ధిదారులు రాష్ట్ర సర్కారు నిర్ణయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పింఛన్‌ మొత్తాన్ని పెంచకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. గద్దెనెక్కి రెండేళ్లు గడిచిపోయాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పింఛన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్‌, బోధకాల బాధితులు, డయాలసిస్‌ పేషెంట్లకు నెలకు రూ.2,016 పింఛన్‌ను ప్రతినెలా అందించింది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మొత్తాన్ని రూ.నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. దివ్యాంగులకు రూ.ఆరువేలు చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పింఛన్ల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 1,47,103 మంది పింఛన్‌ పొందుతున్నారు. వీరిలో 35,150 మంది వృద్ధులు, 36,326 మంది వితంతువులు, 10,055 మంది దివ్యాంగులు, 2,110 మంది ఒంటరి మహిళలున్నారు. వీరంతా పింఛన్‌ మొత్తాన్ని ఎప్పుడు పెంచుతారో? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పెండింగ్‌లో 3,320 దరఖాస్తులు

జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీ ల పరిధిలో 3,320 మందికి పైగా వివిధ కేటగిరీల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం పెన్షన్‌ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలి యని పరిస్థితి. దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టి అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇవే కాకుండా పరిశీలన పూర్తి కాని పెండింగ్‌ దరఖాస్తులు జిల్లా, మండల స్థాయిలో కోకొల్లలున్నాయి. కాగా, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నవారికి ఎప్పుడు పింఛన్లు వస్తాయనే సమాచారం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు.

పెంపు ఇప్పట్లో ఉండేనా?

పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు, ప్రతిపాదనలు చేయలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు కూడా విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా..లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పింఛన్ల పెంపుపై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ప్రతిపక్షాలతోపాటు లబ్ధిదారులు, అర్హులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో పింఛన్ల వివరాలు

మొత్తం పింఛన్లు 1,47,103

వద్ధాప్య.. 35,150

వితంతు 36,326

వికలాంగుల. 10,055

గీత కార్మికుల 274

పైలేరియా 223

డయాలసిస్‌ 122

ఒంటరి మహిళ 2,110

బీడీ కార్మికుల 62,062

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement