ముప్పై ఏళ్లకు కలిసిన మిత్రులు
నిర్మల్: ‘అరెరె.. ఎన్నేండ్లయితందిరా నిన్నుజూసి, ఎట్లుండేటోనివి ఎట్లయిపోయినవ్‌రా..!? అసలేంజేస్తున్నవ్, ఎట్లున్నవ్‌రా..’ అంటూ గట్టిగ ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ పలకరించుకున్నారు. ‘ఓయ్.. ఏంటే నువ్వు ఇలా మారిపోయావ్, అస్సలు నిన్ను గుర్తుపట్టలేదు తెలుసా..! బడి తర్వాత మళ్లీ అసలు నీ ముఖమే కనిపించలేదే..’ అంటూ ఆశ్చర్యం, ఆనందంతో ఆత్మీయతను పంచుకున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరుగా వస్తుంటే.. ఆ వేడుక ఆనందాల పండుగలా మారింది. కొంతమంది కళ్లల్లో నీళ్లసుడులనూ తీసుకొచ్చింది. జిల్లాకేంద్రంలోని బాగులవాడ సరస్వతీ శిశుమందిర్‌లో ఎప్పుడో 1994–95లో పదోతరగతి పూర్తిచేసుకున్న పూర్వవిద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. స్థానిక రెడ్డిగార్డెన్స్‌లో ముప్పయేళ్ల తర్వాత తొలిసారి పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు.
విదేశాల నుంచీ వచ్చారు
ఆస్ట్రేలియాలో ఉంటున్న రాంగోపాల్, ఉగాండాలో ఉన్న ప్రణీత్, యశోదా ఆస్పత్రిలో అంకాలజిస్ట్‌గా చేస్తున్న దయాకర్ లాంటి వాళ్లూ సమ్మేళనానికి హాజరయ్యారు. 1994–95లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ బ్యాచ్ నుంచి మూడు స్టేట్‌ర్యాంక్‌లు రా వడం గమనార్హం. ఈ సందర్భంగా అంతా కలిసి భోజనాలు చేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు రావుల సూర్యనారాయణ, ఆచార్యులందరినీ ఘ నంగా సన్మానించారు. తమను కలిపిన శిశుమందిర్ పునర్నిర్మాణానికీ తమవంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకువచ్చారు.


