రిజర్వేషన్‌.. టెన్షన్‌! | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్‌.. టెన్షన్‌!

Jan 12 2026 7:59 AM | Updated on Jan 12 2026 7:59 AM

రిజర్వేషన్‌.. టెన్షన్‌!

రిజర్వేషన్‌.. టెన్షన్‌!

● ఎన్నో ఆశలతో ఆశావహుల నిరీక్షణ ● ‘కలిసిరాకుంటే ఎలా’ అని సందేహం ● ముందస్తు ఖర్చులకూ వెనుకడుగు ● ఆచితూచి ‘మున్సిపోల్స్‌’కు అడుగులు

నిర్మల్‌: సంక్రాంతి పండుగ కాగానే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రానుందన్న ప్రచారం జోరందుకుంటోంది. ఓటర్ల జాబితా సోమవారం ఫైనల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్‌, చైర్మన్‌ బరిలో నిలువాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్‌ టెన్షన్‌ కనిపిస్తోంది. నిన్నమొన్నటి దాకా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల లొల్లిలో పడ్డ వారిలో ఇప్పుడు అసలు కలవరం మొదలైంది. తమ వార్డుల్లో రిజర్వేషన్‌ కలిసొస్తుందా.. లేదా.. అన్న పరేషాన్‌లో ఉన్నారు. ఇప్పటిదాకా పడ్డ కష్టమంతా వృథా కావొద్దంటే రిజర్వేషన్‌ కలిసి రావాలని కోరుకుంటున్నారు.

కలిసి వస్తుందన్న నమ్మకంతో..

గతంలో వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి ఎలా వస్తాయోనన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఒకట్రెండు వార్డులు మినహా దాదాపు అన్ని వార్డుల్లో అంచనా వేయొచ్చన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. మారిన ఓటరు జాబితా లెక్క.. రిజర్వేషన్లలోనూ ఏమైనా మార్పులు జరిగితే ఎలా? అన్నదే ఆశావహుల సందేహం. అలాగే.. తాము బరిలో దిగాలనుకున్న చోట మహిళల రిజర్వేషన్‌ వస్తే ఎలా..? భార్యనో.. అమ్మనో.. బరిలో దింపాల్సిందేనా? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. జనరలో, మహిళనో మొ త్తం మీద తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతోనే ఆశావహులంతా గల్లీల్లో తిరుగుతున్నారు.

చైర్మన్‌ స్థానం ఏమొస్తుందో..!

వార్డుల్లో పోటీచేసే ఆశావహుల టెన్షన్‌ ఒకెత్తయితే, చైర్మన్‌గా బరిలో దిగాలనుకుంటున్న వారి పరేషాన్‌ మరింత ఎక్కువగా ఉంటోంది. చాలా ఏళ్లుగా చైర్మన్‌ సీటుపై గురిపెట్టుకున్నా.. రిజర్వేషన్‌ కలిసిరాకపోతే మరో ఐదేళ్లదాకా వేచిచూడాల్సిందే. చైర్మన్‌గా గెలిస్తే.. ఐదేళ్లు పురపాలన అనుభవం సాధించడమే కాకుండా ఆ తర్వాత రాజకీయాల్లో మరోమెట్టు ఎదగడానికి అవకాశంగానూ భావిస్తుంటారు. అందుకే.. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీల్లోనూ ప్రధాన పార్టీల నుంచి చైర్మన్‌ స్థానాలకు ఎవరు పోటీలో ఉన్నారన్న అంశంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది.

ఖరారైన తర్వాతనే..

‘అన్నా.. మనం గెలువాలంటే గల్లీలో కొంతైనా ఖర్చు చేయాల్నే..’ అని అనుచరులు ఎంత ఒత్తిడి తీసుకువస్తున్నా.. చాలామంది ఆశావహులు జేబులో నుంచి రూపాయి కూడా తీయడం లేదు. రిజర్వేషన్లు ఖరారయ్యేదాకా పైసా ఖర్చు చేసేది లేదని చెబుతున్నారు. పక్కాగా తమకు అనుకూలంగా రిజర్వేషన్‌ వస్తుందన్న లెక్కలున్నచోట మాత్రం సంబంధిత ఆశావహులు కాలనీ అభివృద్ధి కోసమంటూ కాసులు ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బులతో గల్లీల్లో డ్రైనేజీలు కట్టించడం, రోడ్లకు మరమ్మతులు చేయించడం లాంటి పనులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement