‘సంఘ’టిత సమాజమే లక్ష్యం
నిర్మల్: నిత్య శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణం చేయడంతోపాటు సంఘటిత సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్ లక్ష్యమని ఆర్‌ఎస్ ఎస్ దక్షిణమధ్య(తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక)క్షేత్ర ప్రచారక్ శ్రీరాం భరత్‌కుమార్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం శతాబ్ది ఉత్సవం, పథసంచలన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానవక్తగా భరత్‌కుమార్ హాజరై మాట్లాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ‘పంచపరివర్తన’ పేరిట ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్నారు. కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసతతో సమాజం ఏకం కావాలని, పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని, మనదైన కుటుంబవ్యవస్థను, అలాగే సంస్కృతిని కాపాడుకోవాల ని, ఇక ఈ దేశపౌరులుగా ఇక్కడి చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలన్న ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ‘వసుదైక కుటుంబకం’లా ప్రపంచం ఉండాలన్న లక్ష్యంతో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని తెలిపారు. అయోధ్యలో ఉన్నది కేవలం రాముడి విగ్రహం కాదని, ఆ రూపంలో ఉన్న ఆదర్శమూర్తి అని వివరించారు.
హిందువుగా జీవించాలి..
ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందని విశిష్ట అతిథి రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంకే.సింగ్ అ న్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న సమాజ సంఘటనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అథితి డాక్టర్ చిటికేశి శ్రీనివాస్ మాట్లాడుతూ వందేళ్లు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఆర్‌ఎస్ ఎస్ నిలబడిందన్నారు. కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ చాలక్ నిమ్మల ప్రతాప్‌రెడ్డి, జిల్లా, నగర చాలక్‌లు నూకల విజయ్‌కుమార్, ప్రమోద్‌చంద్రారెడ్డి, జిల్లా సహసంచాలక్ కృష్ణదాస్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పథసంచలన్..
ఒకే రకమైన గణవేశ(యూనిఫాం)తో స్వయం సేవకులు నిర్మల్ పురవీధులలో చేపట్టిన పథసంచలన్ ఆకట్టుకుంది. ఏఎన్‌రెడ్డి కాలనీ, ఆర్‌కే కన్వెన్షన్, దేవరకోట దేవస్థానం మూడుచోట్ల నుంచి బయలుదేరిన ర్యాలీలు స్థానిక జయశంకర్ సర్కిల్‌లో కలిశాయి. అక్కడి నుంచి అంబేద్కర్‌చౌక్ వరకు వెళ్లి, తిరిగి ఎన్‌టీఆర్ మినీస్టేడియం చేరుకున్నారు. పథసంచలనంలో దారిపొడవునా భగవధ్వజాలకు, స్వయంసేవకులకు మహిళలు మంగళహారతులు పట్టారు. పూలు చల్లారు. అనంతరం ఎన్టీఆర్ మినీస్టేడియంలో ధ్వజారోహణం, శతాబ్ది ఉత్సవం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, సీనియర్ నేతలు సత్యనారాయణగౌడ్, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యే పూర్తి గణవేశతో పథసంచలన్‌లో పాల్గొని నడవడం అందరినీ ఆకట్టుకుంది. పలువురు చిన్నారులూ ఆర్‌ఎస్‌ఎస్ గణవేశ, ఝాన్సీరాణి వేషధారణల్లో అలరించారు.
వేదికపై శ్రీరాం భరత్‌కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ ఎంకే.సింగ్, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తదితరులు
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంసేవకులు
‘సంఘ’టిత సమాజమే లక్ష్యం
‘సంఘ’టిత సమాజమే లక్ష్యం
‘సంఘ’టిత సమాజమే లక్ష్యం


