ఆన్‌లైన్‌లో ఆదాయ వ్యయాలు!
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ఏటా వివిధ రకాల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఈ నిధుల ఖర్చులను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిధులు సద్వినియోగమయ్యాయా లేక దుర్వినియోగమయ్యాయా అనే అంశాన్ని తేలుస్తారు. ఈ నేపథ్యంలో 2024–25 నిధుల వినియోగంపై జిల్లాలో ఆడిట్ అధికారులు లెక్కలు తేలుస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్ర–రాష్ట్ర పథకాల ద్వారా అందిన నిధుల వినియోగంలో పారదర్శకత ఎంత కలిగింది, ఖర్చు, ఆదాయ వ్యవస్థ ఎంత సమగ్రమైందనే అంశాలపై వ్యయ పరిశీలన జరుగుతోంది.
మండల–జిల్లా పరిషత్తుల్లో..
పంచాయతీలకు స్థానిక ఆదాయ వనరులతోపాటు ఎస్‌ఎఫ్‌సీ 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు కలిపి ప్రభుత్వం ఇస్తున్న మంజూరులను, వినియోగ లెక్కలను సేకరిస్తున్నా రు. ఇంటిపన్ను, వ్యాపార లైసెన్సు వంటి స్థాని క ఆదాయ విషయాల్లోనూ వసూలు అవకాశాలను, జరిమానాలను ట్రాక్ చేస్తున్నారు. ఇదే విధంగా, మున్సిపల్ కార్యాలయాల్లో అర్బన్ డెవలప్‌మెంట్, ప్రాంతీయ పన్ను ఆదాయ అంశాలను పరిశీలిస్తున్నారు. ఆలయాలు, మార్కెట్ కమిటీలు వంటి సంస్థలకు కూడా ఆదాయ–ఖర్చు పరిశీలన వ్యాప్తంగా సాగుతోంది.
ఆన్‌లైన్‌లో నమోదు..
ఆడిట్ పూర్తయిన వెంటనే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా నిర్వహించేవారు, నాలుగేళ్లుగా నూతన ఆధునికీకరణ విధానానికి మారారు. ఆడిట్ నిర్వాహకుడు, ముగ్గురు జూనియర్, ఆరుగురు సీనియర్, ఒక అసిస్టెంట్‌తో మొత్తం తొమ్మిది మందితో సమగ్ర తనిఖీ జరుగుతోంది.
జిల్లాలో ఆడిట్ వివరాలు
కార్యాలయం మొత్తం పూర్తయినవి
మండల పరిషత్ 18 16
గ్రామ పంచాయతీ 396 394
మున్సిపాలిటీ 3 3
మార్కెట్ కమిటీ 5 5
ఆలయాలు 5 4
జిల్లా పరిషత్ 1 0


