విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్టాన వేడుకలు వైభవంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈవో భూమయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పరిసరాల్లో హోమం, ఇతర పూజా కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన మండపాలను పరిశీలించారు. కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. అనంతరం అడెల్లి మహాపోచమ్మ మాలధారణ చేసిన భక్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్, పార్టీ మండల అధ్యక్షుడు నరేశ్, సీనియర్ నాయకులు మంతెన గంగారెడ్డి, చంద్రప్రకాశ్‌గౌడ్, సాహెబ్‌రావు, వీరయ్య, పోతన్న, ముత్యంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, అయిర నారాయణరెడ్డి, దావూజీ, నారాయణనాయక్, ప్రకాశ్, జమాల్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
సారంగపూర్: రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామంలో ఐకేపీ, బోరిగాంలో సోయా, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. నిర్మల్‌లోని కేదారీనాథ్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మోంథా తుపాను కారణంగా ధాన్యంలో, సోయా పంటల్లో తేమశాతం పెరిగిందని, తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.


