రోడ్డెక్కిన సోయా రైతులు
కుంటాల: మోంథా తుపాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో వరి, సోయా, మొక్కజొన్న ధాన్యం తడిసింది. తడసిన సోయా కొనుగోలు చేయాలని కుంటాలలో రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. సోయా పంట చేతికి వచ్చి నెలరోజులైందని కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో ఇప్పుడు వర్షానికి తడిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కమల్‌సింగ్ అక్కడి చేరుకోగా, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు పేర్కొన్నారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌కు తహసీల్దార్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ధర్నాలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తాద్రి, నాయకులు జక్కుల గజేందర్, తాటి శివ, కళ్యాణ్ గజేందర్, సబ్బిడి రాకేశ్, బోగ గోవర్ధన్, బొంతల పోశెట్టి, బోగ గజేందర్, రాధాకృష్ణ, అనిల్, రైతులు పాల్గొన్నారు. మరోవైపు తడిసిన సోయాను ఆరబెట్టేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.


