● నేనంటే మీకెందుకు ఇష్టం లేదు? ● సమస్యలెందుకు పట్టించుకోరు? ● నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ● నా పేరెందుకు చెడగొడుతున్నారు? ● పాలకులు, ప్రజలను ప్రశ్నిస్తున్న పట్టణం
నిర్మల్.. ఆహా నిమ్మలంగా ఎంతబాగుంది. కానీ.. ఏం లాభం. ఆ పేరులో మినహా ఊరిలో నిర్మలత్వం ఎక్కడుంది చెప్పండి. ఎప్పుడో వందలఏళ్ల క్రితం ఏర్పడ్డ చరిత్ర. అప్పుడెప్పుడో 1952లో మున్సిపాలిటీగా గుర్తించారు. అప్పటి ఊరి జనాభా పదివేల మంది. ఇప్పుడు లక్ష దాటిపోయి, రెండులక్షలకు దగ్గరవుతున్నారు. పెరిగిన జనాభాకు తగ్గట్లు వసతులు కల్పించారా..!? కనీసం ఇంతమంది జనాభాకు తగ్గట్లు బల్దియాలో కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పెంచారా..!? సర్కారు నుంచి పట్టణం కోసం నిధులు తెస్తున్నారా..!? ఇవన్నీ చేస్తే.. మరి గల్లీలన్నీ ఎందుకిట్ల గలీజుగా కనిపిస్తున్నాయో చెప్పండి. మీరు గాంధీచౌక్‌కే పోతారో.. బుధవార్‌పేట్‌కే వెళ్తారో.. ప్రియదర్శినినగర్‌లోనే తిరుగుతారో.. ఇంకే గల్లీలో తిరుగుతారో మీ ఇష్టం. ఎక్కడైనా కనీసం ఒక్క రోడ్డయినా సక్కగా ఉందా..! డ్రైనేజీ సిస్టం పక్కాగా ఉందా..! డ్రైనేజీల్లో నుంచి వెళ్లకుండా నల్లాపైపులైన్లు ఉన్నాయా..!? గల్లీల్లో మూలమలుపులు, సందు చివరలు చెత్తలేకుండా కనిపిస్తున్నాయా..! కనీసం దుమ్ముధూళీ లేకుండా ఏ ఒక్క రోడ్డయినా ఉందా..!? ఉట్టిగనే కాదు.. మీరే స్వయంగా చూసి చెప్పండి.