డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి | YSRCP MP Gumma Thanuja Rani Meets Union Minister Dharmendra Pradhan Over AP DSC Scam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి

Jun 23 2026 4:45 AM | Updated on Jun 23 2026 4:45 AM

YSRCP MP Gumma Thanuja Rani Meets Union Minister Dharmendra Pradhan Over AP DSC Scam

కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తున్న తనూజరాణి

16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చంద్రబాబు సర్కారు అక్రమాలు చేసింది 

పరీక్ష పత్రాల లీకేజీ, క్రీడా కోటా పేరుతో భారీ మోసాలు జరిగాయి 

ఈ భారీ స్కాంపై స్పందించండి 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజారాణి వినతి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వైఎస్సార్‌సీపీ కోరింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మలిచిందని ఆ పార్టీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణి ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో రూపొందించిన భారీ కుంభకోణమని.. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినపతిపత్రం అందచేశారు. అందులోని ముఖ్యాంశాలు.. 

పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతర 
16వేల పోస్టుల భర్తీ కోసం జరిపిన డీఎస్సీ పరీక్షలో పారదర్శకతను కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకీ, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వినర్‌కు ఉండేది. అయితే, ఈసారి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే, ప్రశ్నపత్రాల అప్‌లోడ్‌ తదితర బాధ్యతలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించారు. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న ఓ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అదే డీఎస్సీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పేపర్‌ లీక్‌కు ప్రత్యక్ష నిదర్శనం. అయితే, మెరిట్‌ జాబితా నుంచి అతని పేరు తొలగించారు.  

ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం 
ఇక ఫలితాల ప్రకటనలో కూడా ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు. గతంలో కలెక్టరేట్‌ నోటీసుబోర్డులపై మెరిట్‌ లిస్టులు, మెరిట్‌–కమ్‌–రోస్టర్‌ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆన్‌లైన్‌కు పరిమితం చేయడంతో అభ్యర్థులు  ఇబ్బందిపడ్డారు. నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు, కటాఫ్‌ మార్కుల ఆధారంగా ఎంపిక పూర్తయిన తర్వాతే ధృవపత్రాల పరిశీలన జరగాలి. కానీ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కూడా పలువురు అభ్యర్థులను తప్పించారు. 

స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు 
గతంలో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కొత్త జీఓలు జారీచేసింది. మరోవైపు.. టీచర్‌ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఫోన్‌ నంబర్లు తెలిసినా అసలు నిందితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేయకుండా దర్యాప్తును బలహీనపరిచారు. ఈ డీఎస్సీ కుంభకోణం పశ్చిమ బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కాం కంటే తీవ్రమైనది. అందువల్ల సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement