
ఈ పరిశ్రమల్లో సుమారు 40% మగువలవే
సంఖ్యాపరంగా చూస్తే ఇవి 2.60 కోట్లకుపైనే
తెలుగు రాష్ట్రాల్లోనూ రాణిస్తున్న అతివలు
భారతీయ మహిళా వ్యాపారులు పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు, నిర్వహణలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఈల్లో సుమారు 40 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే కావడం విశేషం. అత్యధికంగా 30 లక్షలపైచిలుకు మహిళా పారిశ్రామికవేత్తలతో దేశంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.
భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, మొత్తం ఎగుమతుల్లో 45% వాటా ఎంఎస్‌ఎంఈలదే అంటే ఇవి ఏ స్థాయిలో పురోగతి సాధించాయో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 37.54%కి చేరింది. దేశవ్యాప్తంగా 2025 జూలై 24 నాటికి 6,57,97,647 ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. వీటిలో 39.59 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే. దేశంలోని మొత్తం ఎంఎస్‌ఎంఈల్లో సూక్ష్మ, చిన్న తరహావే 99.99%. సూక్ష్మ కంపెనీల్లో 39.79 శాతం, చిన్న తరహా కంపెనీల్లో 11.63 శాతం మహిళలు నెలకొల్పినవి ఉన్నాయి.
ప్రభుత్వ ప్రోత్సాహంతో..
ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) సూక్ష్మ సంస్థల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఇది 9.87 లక్షలకు పైగా యూనిట్లకు సహాయం అందింది. 2023 సెప్టెంబర్‌లో రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తుల వారి నైపుణ్యాలను, మార్కెట్‌తో అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025 జూన్ 26 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది.

2020లో ప్రవేశపెట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎంఎస్‌ఎంఈలకు ఉచిత, పేపర్ రహిత రిజిస్ట్రేష¯Œ కు వీలు కల్పిస్తోంది. అనధికారిక వ్యాపారాలకు అధికారిక ప్రయోజనాలను విస్తరించడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్ 2023లో అందుబాటులోకి వచ్చింది. ఎంఎస్‌ఎంఈ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి మార్గదర్శనం చేసేందుకు ‘యశస్విని’ అనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.
మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వస్తు, సేవల్లో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి సేకరించాలని ప్రభుత్వ సేకరణ విధానం నిర్దేశించింది. దీనికింద ఇందులో 3 శాతం మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల నుండి కొనుగోలు చేయాలి. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మహిళలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.
ఉద్యోగాల్లో 18.73%
ఉపాధి: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన ఉద్యమ్ పోర్టల్లో నమోదిత మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా సృష్టించిన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 18.73%
పెట్టుబడి: మొత్తం పెట్టుబడిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈల వాటా 11.15%
టర్నోవర్: మొత్తం టర్నోవర్‌లో వాటా 10.22%
కేంద్రం విడుదల చేసిన ‘ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వార్షిక నివేదిక 2024–25’ ప్రకారం..
⇒ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు.. వ్యవసాయం తరవాత అతిపెద్ద ఉద్యోగ కల్పనా రంగం.
⇒ మొత్తం సృష్టించిన ఉద్యోగాలు 24.4 కోట్లు
⇒ మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో సూక్ష్మ పరిశ్రమలు 98.6 శాతం.
⇒ 2024 డిసెంబరు 31 నాటికి.. మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో మహిళలు యజమానులుగా ఉన్న వాటి శాతం 28.8.