నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా? | Will fractured vote banks push DMK and AIADMK towards unity | Sakshi
Sakshi News home page

నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?

May 7 2026 9:09 AM | Updated on May 7 2026 9:34 AM

Will fractured vote banks push DMK and AIADMK towards unity

అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్‌ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. 

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్‌కు భారీ షాక్‌ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్‌ అని తిట్టిపోశాయి. 

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే..  ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. 

ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయి

పుట్టుకే..

1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్‌ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.

భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)
గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అ‍న్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.

కేడర్ స్థాయి ఘర్షణ
దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.

మరి జాతీయ పార్టీలతో జట్టు?.. 

తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 

👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)
తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్‌లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.

👉విడదీసి పాలించడం (Cutting the Competition)
తమిళనాడులో కాంగ్రెస్‌కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 

👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)
ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం.  సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్‌తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్‌గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. 

విజయ్‌ రాకతో సీన్‌ మారేనా?

2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్‌ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్‌లోకి పడిపోయాయి.  తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. 

ఇదే అసలు సమస్య.. 

నాయకత్వ అహంకారం-పట్టుదల  ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్‌ గుణం. జనతా సర్కార్‌ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్‌ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 

1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్‌ అరెస్ట్‌ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.

తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు.

Advertisement
 
Advertisement
Advertisement